ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్స్.. శర్వానంద్. తన కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఫన్, ఫ్యామిలీ మిక్స్ చేసిన కథలకు శర్వా బాగా సూటవుతాడు. `ఆడాళ్లూ మీకు జోహార్లూ` సరిగ్గా శర్వాకు సూటయ్యే కథ. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక నాయిక. మార్చి 4న వస్తోంది. ఇప్పుడు ట్రైలర్ విడుదల చేశారు.
122 సెకన్ల ట్రైలర్ ఇది. మొదట్నుంచి, చివరి వరకూ.. అంతా ఫన్ రైడే. సాధారణంగా సినిమాలో ఎంత ఫన్ ఉన్నా, చివర్లో ఎమోషనల్ ఫీల్ తీసుకొచ్చి, ట్రైలర్ ని కట్ చేస్తారు. ఈసారి అలా కాదు. ట్రైలర్ అంతా.. ఒకటే గోల. పెళ్లి గోల. చిరు అనే కుర్రాడికి పెళ్లి సెట్ కాదు. దానికి కారణం.. ఇంట్లో ఉన్న లేడీ గ్యాంగే. పెళ్లి చూపులకు వెళ్లడం, ఏదో కారణంతో ఆ సంబంధం రిజెక్ట్ చేయడం… ఇలా సాగుతుంటుంది. `చిరుకి బెస్ట్` ఇవ్వాలన్నది వాళ్ల ఆలోచన. కానీ.. అది కాస్త వికటిస్తుంది. చిరు పెళ్లి చూపులు చూసి, రిజెక్ట్ చేస్తే, ఆ అమ్మాయికి త్వరగా సంబంధం కుదిరిపోతుందని ఓ సెంటిమెంట్ కూడా మొదలవుతుంది. చివరికి…`నాకు ఆస్కార్ వద్దు.. సినిమా ఆడితే చాలు` అనే పరిస్థితికి వచ్చేస్తాడు చిరు. అలాంటి కుర్రాడి జీవితంలో ఓ అమ్మాయి వస్తుంది. తనకుండాల్సిన రిక్వైర్మెంట్లు తనకున్నాయి. తనని పెళ్లి చేసుకున్నవాడు.. ఇంట్లో కూర్చుని, వంట చేసి, పిల్లల్ని చూసుకుంటే చాలట. అంటే ఇల్లరికం అన్నమాట. మరి చిరు అది చేశాడా? తన పెళ్లి ఎలా సెట్ చేసుకున్నాడు? అనేదే మిగిలిన కథ. ట్రైలర్ లోనే కథంతా చెప్పేశారు. అందులో కావల్సినంత ఫన్ మూమెంట్స్ ఉన్నాయని అర్థమవుతోంది. శర్వా అయితే చాలా ఈజ్‌తో చేసేశాడు. కావల్సిన కామెడీ గ్యాంగ్ అంతా ఉంది. కాబట్టి.. ఎంటర్టైన్మెంట్కి ఢోకా లేదన్న విషయం స్పష్టంగా అర్థమైపోతోంది. దాంతో పాటు ఎమోషన్‌నీ మిక్స్ చేస్తే… ఈ యేడాదిలో టాలీవుడ్ మరో హిట్ చూడడం ఖాయం.