తెలుగు360 రేటింగ్: 2.5/5
మాస్, యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్… ఈ జోనర్ల మధ్య కూడా ఫ్యామిలీ డ్రామాలు రావడం ఓ రకంగా అదృష్టమే. ఈ తరహా కథల్ని అందించడానికి టాలీవుడ్ లో ఎప్పుడూ ఎవరో ఓ దర్శకుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈ జనరేషన్లో.. అలాంటి కథలకు పెద్దపీట వేస్తోంది మాత్రం… కిషోర్ తిరుమల అనే చెప్పుకోవాలి. తన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా, క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంటాయి. కాబట్టి.. ఫ్యామిలీ మొత్తం వెళ్లడానికి భయపడాల్సిన పనిలేదు. `ఆడాళ్లు మీకు జోహార్లు` అని టైటిల్ పెట్టుకున్నాక, శర్వానంద్ లాంటి హీరో ఉన్నాక.. కచ్చితంగా ఇది ఫ్యామిలీ డ్రామానే అవుతుంది. సో.. ఈ సినిమా జోనర్ విషయంలో, అది ఎవరికి క్యాటర్ చేస్తున్నారన్న విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. మరి… ఈ ఆడాళ్లు ఎవరికి నచ్చుతారు? వాళ్ల కథా కమామిషు ఏమిటి?
చిరంజీవి (శర్వానంద్) ఆడవాళ్ల చుట్టూ పెరుగుతాడు. అమ్మ (రాధిక), పిన్నమ్మలు, బాబాయ్‌లూ.. ఇదే తన ప్రపంచం. రాజమండ్రిలో ఓ కల్యాణమండపం నడుపుతుంటాడు. తనకు పెళ్లికావడం లేదన్న బాధ తప్ప ఇంకేం లేదు. చిరు పెళ్లంటే మాటలా? అమ్మకీ, తన ఐదుగురు పిన్నమ్మలకూ నచ్చాలి. ఒకరికి నచ్చితే మరొకరు వద్దంటారు. అందుకే పెళ్లి సంబంధాలన్నీ కాన్సిల్ అవుతుంటాయి. తను రిజెక్ట్ చేసే స్థితి నుంచి.. తనని రిజెక్ట్ చేసే దుస్థితికి వస్తాడు చిరు. అనుకోకుండా ఓరోజు ఆధ్య (రష్మిక)తో పరిచయం అవుతుంది. ఆధ్య చిరుని ఇష్టపడుతుంది. అయితే చిరు మాత్రం ఆధ్యని ప్రేమిస్తాడు. తన మనసులోని మాట చెప్పేస్తాడు. అయితే ఆధ్య మాత్రం మా అమ్మ వకుళ (ఖుష్బూ)కి నచ్చని పని ఏదీ చేయను అని ఖరాఖండీగా చెప్పేస్తుంది. వకుళ సమస్యంటంటే.. పెళ్లిపై తనకు సదాభిప్రాయం ఉండదు. తన కూతురికి పెళ్లే చేయకూడదని అనుకుంటుంది. మరి వకుళ మనసుని గెలుచుకోవడానికి చిరు ఏం చేశాడు? తన పెళ్లి సమస్యని తానే ఎలా సాల్వ్ చేసుకున్నాడు? అనేదే మిగిలిన కథ.
అమ్మ, పిన్నమ్మల మధ్య పెరిగిన హీరో కథ ఇది. వాళ్లకు నచ్చితే తప్ప, పెళ్లి చేసుకోకూడదని అనుకోవడం, ఆ ప్రోసెస్‌లో తనకు పెళ్లే కాకుండా పోవడం ఇదంతా కాస్త ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చే మేటరే. అయితే ఓ అమ్మాయిని చూసి ఇష్టపడడం, అయితే ఆ అమ్మాయి తల్లి నుంచి అసలు సమస్య రావడం.. ఇదంతా కాస్త పాత చింతకాయ పచ్చడి తరహా కథ. ఈ రెండింటినీ మిక్స్ చేసే ప్రయత్నంలో కాస్త కామెడీని, కాస్త ఎమోషన్‌నీ జోడించుకుంటూ వెళ్లాడు దర్శకుడు. తొలి భాగంలో చాలా వరకు హీరో పెళ్లి చూపుల ప్రయత్నాలు, తన ఫస్ట్రేషన్ ఇవే కనిపిస్తాయి. ఆధ్య వచ్చాక… ఓ రొటీన్ లవ్ స్టోరీ మొదలవుతుంది. ఆధ్య మనసులో ఏముందో తెలిశాక… కథ సెకండాఫ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది.చాలా చిన్న లైన్ ఇది. ఇలాంటి కథకు సన్నివేశాల్లో బలం ఉండాలి. తొలి సగంలో… రచయితగా కిషోర్ తిరుమల మార్క్ అక్కడక్కడ కనిపిస్తుంది. శర్వానంద్ ఫస్ట్రేషన్‌ని బాగా చూపించాడు దర్శకుడు. వెన్నెల కిషోర్ బెడ్ రూమ్ సీన్ బాగా నవిస్తుంది. ఇంట్రవెల్ సీన్లో `బాక్సు` డైలాగ్ అయితే… థియేటర్ల నుంచి నవ్వుకుంటూ బయటకు రావడానికి పనికొస్తుంది. ఆ డైలాగ్ తో ఇంట్లో ఆడవాళ్ల మనస్తత్వాన్ని దర్శకుడు ఎంత బాగా అర్థం చేసుకున్నాడో తెలుస్తుంది. ఆ డైలాగ్ కి కనెక్ట్ అవ్వని వాళ్లుండరు.
అయితే.. చిన్న చిన్న మెరుపులు తప్ప – తొలి సగంలో ఏమీ ఉండదు. ఇలాంటి టైమ్ పాస్ కథలు ఇంతేలే అనుకుంటూ కాస్త సర్దుకుపోవడానికి ప్రయత్నించొచ్చు. ద్వితీయార్థంలో హీరోయిన్ వాళ్ల అమ్మ మనసుని గెలుచుకోవడానికి హీరో ఏం చేశాడో అంతే వినోదాత్మకంగా చెబితే బాగుణ్ణు. ఖుష్బూ ఫ్యాక్టరీలో హీరో దూరి, అలా.. అలా ఖుష్బూ మనసులో చోటు సంపాదించడానికి హీరో చేసే ప్రయత్నాలు… బోరింగ్ గా అనిపిస్తాయి. అది చాలదన్నట్టు ఓ ప్రేమకథని హీరో సుఖాంతం చేయడానికి ప్రయత్నించడం మరీ రొటీన్ ఫార్మెట్లో సాగింది. పదిమంది ఆడాళ్లు గుంపుగా చేరి, ఒకరి తరవాత ఒకరు డైలాగులు చెప్పుకోవడం వంటి సీన్లు చూస్తే.. ఓ సీరియల్ ని వెండి తెరపై చూసినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే డిటో టీవీ సీరియలే. ఆడాళ్లంతా ఓ చోట చేరితే.. ఖుష్బూ స్పీచు అందుకుంటుంది. `ఇది శర్వా సినిమా.. ఆయనే హీరో` అని చెప్పడానికన్నట్టు పక్క గదిలో ఉన్న శర్వా క్లోజుల్ని అక్కడక్కడ వాడుకున్నారు. ఇంట్రవెల్ బ్యాంగ్ దగ్గర `బాక్సు` డైలాగ్ ఎలా పేలిందో.. అలాంటి మ్యాజిక్ క్లైమాక్స్‌లోనూ చేసి ఉంటే… ఆ ఫీలింగ్ కాస్త తగ్గేది.
అయితే ఆడవాళ్ల మనస్తత్వాన్ని దర్శకుడు కొంచెం అర్థం చేసుకున్నాడనిపిస్తుంది. చాలా సందర్భాల్లో వాళ్ల తరపున మాట్లాడే విధానం నచ్చుతుంది. క్లైమాక్స్‌లో ఖుష్బూ చెప్పే డైలాగ్ లెంగ్తీగా ఉన్నా, అక్కడ మగవాళ్ల నుంచి ఆడవాళ్లు ఏం కోరుకుంటారో చెప్పగలిగాడు. టైటిల్ న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనో ఏమో.. బాబాయ్‌లకు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. ఇంట్లో అంతా ఆడవాళ్లే కనిపిస్తారు. బాబాయ్ లు ఒక్కట్రెండు సీన్లలోనే మెరుస్తారు. ఓ చోట `మనం ఎక్కడున్నా బ్యాక్ గ్రౌండ్‌లోనే` కదా.. అంటూ ఫన్నీ డైలాగ్ చెప్పించాడు.
శర్వాకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. ఈమధ్య సీరియస్ రోల్స్ తెగ చేస్తున్న శర్వా.. ఈ పాత్రని చాలా ఈజ్‌గా చేసేశాడు. రష్మిక చాలా అందంగా కనిపించింది. రాధిక, ఖుష్బూ, ఊర్వశి… ఇలాంటి మేటి నటీమనుణుల్ని వెండి తెరపై చూసుకోవడం ఆనందంగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ కాస్త నవ్వించగలిగాడు. సెకండాఫ్‌లో అక్కడక్కడ సత్య కూడా. దేవిశ్రీ సంగీతంలో వచ్చిన పాటలు ఇది వరకే విన్న ఫీలింగ్ కలిగిస్తాయి. కానీ తెరపై ఆ పాటలు వచ్చే మూడ్, సిట్యువేషన్లకు సరిపోయాయి. కిషోర్ తిరుమల ఈసారి ఎమోషన్ని మిస్సయ్యాడు అనిపిస్తుంది. ఫన్ పండించే విషయంలో అక్కడక్కడ వర్కవుట్ అయినట్టే, ఎమోషన్ కూడా మిక్స్ చేయగలిగితే బాగుండేది.
ఫినిషింగ్ టచ్: ఆడాళ్లే ఆదుకోవాలి
తెలుగు360 రేటింగ్: 2.5/5