పంజాబ్ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమయింది. ఇప్పటి వరకూ కాంగ్రెస్, అకాలీ-బీజేపీ కూటముల మధ్య మారుతూ వస్తున్న అధికారం ఈ సారి ఆమ్ఆద్మీ పార్టీ పరం అయింది. ఆ పార్టీకి అఖండ విజయం లభించించిది. ఉన్న 117 స్థానాల్లో ఏకంగా 91 స్థానాల్లో విజయం సాధించింది. ఇది అనితర సాధ్యమైన విజయం. కుప్పకూలిన స్థితి నుంచి అత్యున్నత స్థాయికి ఎదగడం సామాన్యమైన విషయం కాదు. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన తర్వాత పంజాబ్‌లో మంచి క్రేజ్ వచ్చింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో నాలుగు స్థానాలు గెలుచుకుని సంచలనం సృష్టించింది. తర్వాత వెనుకబడిపోయింది. కానీ ఫీనిక్స్‌లా ఎదిగింది.
ఢిల్లీ మోడల్ పరిపాలన, అధికారంలోకి వస్తే గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆప్‌కున్న క్లీన్ ఇమేజ్, ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాల్లో ఢిల్లీలో ఆప్ చేస్తున్న అభివృద్ధి పంజాబ్‌లోని దిగువ మధ్యతరగతిని ఆకర్షించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన తప్పుల్ని దిద్దుకుంటూ ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ వ్యూహాత్మకంగా ముందుకెళ్లారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ మరే రాజకీయ పార్టీ చేయని విధంగా టెలి ఓటింగ్ ద్వారా పార్టీ రాజ్యసభ సభ్యుడు భగవంత్ మన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఇలా ప్రకటించడానికి కారణం కూడా ఉంది. ఇతర పార్టీలు ఆప్ గెలిస్తే హర్యానా వ్యక్తి సీఎం అవుతారని ప్రచారం చేయకుండా నిలుపదల చేయగలిగారు.
కాంగ్రెస్ ముఠా తగాదాలతో నిర్వీర్యం అయిపోయింది. పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూయే ఆ పార్టీకి మైనస్ అయ్యారు. అయితే కొత్త సీఎం చన్నీ దళితుడు కావడం, రాష్ట్ర జనాభాలో 32 శాతం వారే ఉండటంతో కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో సీఎం పదవిలోకి వచ్చిన చన్నీ కొద్ది కాలంలోనే తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజల్ని ఆకర్షించేలా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ అవన్నీ గ్రూపు రాజకీయాలతో కొట్టుకుపోయాయి. అంతిమంగా కేజ్రీవాల్ చరిత్ర సృష్టించారు.