ఢిల్లీ వెళ్లి కేజ్రీవాల్‌తో భేటీ అవుతానని కేసీఆర్ వెళ్లారు. తీరా అక్కడకు వెళ్లిన తరవత ఆయన ఆమ్ ఆద్మీ పార్టీతో సంప్రదింపులు జరపలేదు. దీంతో ఆ పార్టీకి కోపం వచ్చినట్లుగా ఉంది. వెంటనే టీఆర్ఎస్, కేసీఆర్‌పై రివర్స్ ఆరోపణలు ప్రారంభించారు. కేసీఆర్ ఢిల్లీకి వచ్చింది న్యాయనిపుణులతో సంప్రదింపుల కోసమని అసలు తెలంగాణలో ఏం జరుగుతోందని.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ భారతి విమర్శలు గుప్పించారు.
రెండు రోజుల కిందట బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ కలిశారు. అందుకే తెలంగాణలో ఏం జరుగుతోందనే సందేహాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేత వ్యక్తం చేశారు. సుబ్రమణ్యస్వామి, ఫాలీ నారీమన్ భేటీ గురించి ట్వీట్ ద్వారా సోమ్నాధ్ భారతి కామెంట్ చేసిన తర్వాత మీడియాతోనూ మాట్లాడారు. అవినీతిలో కేసీఆర్ పీహెచ్డీ చేశారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులను, విద్యార్థులను, నిరుద్యోగులను, యువతను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. అన్ని పథకాల్లోనూ కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని, రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమి తప్పదన్నారు.
అయితే ఇప్పటి వరకూ కేసీఆర్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి విమర్శలు చేయలేదు. అనూహ్యంగా తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపింది. కేసీఆర్ అవినీతిపై త్వరలో విచారణ జరుగుతుందని బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్న సమయంలో ఇలా కేసీఆర్ న్యాయనిపుణులతో సంప్రదింపులు జరపడం ఆప్ లాంటి పార్టీల నుచి విమర్శలు రావడానికి కారణం అవుతోంది.