మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో అనే ప్రకటన తర్వాత.. తెలుగులో వినిపించింది లాల్ సింగ్ చద్దా. ఆగస్ట్ 11న థియేటర్లోకి వస్తోంది. ఆ రోజు కోసం గత ఇరవై ఏళ్ళుగా ఎదురుచూస్తున్నాడు అమీర్ ఖాన్. ఎందుకంటే.. లాల్ సింగ్ చద్దా అమీర్ ఖాన్ ఇరవైఏళ్ళుగా కంటున్న కల. నిజానికి ఇది చాలా పెద్ద కల. దీని వెనుక పెద్ద కథే వుంది. ఆరు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న అమెరికన్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కింది లాల్ సింగ్ చద్దా. 1994 విడుదలైన ‘ఫారెస్ట్ గంప్’ ఒక అద్భుతం. మామూలు సినిమా కాదది. రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వంలో వచ్చిన ఫారెస్ట్ గంప్ చరిత్రలో నిలిచిపోయే సినిమాగా ప్రపంచవ్యాప్తంగా ప్రసంసలు దక్కించుకుంది. వరల్డ్ సినిమాని చూసే ఏ ఒక్క ప్రేక్షకుడిని కదిపినా ఫారెస్ట్ గంప్ గురించి ప్రస్థావించకుండా వుండరు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా ఇది.
అమీర్ ఖాన్ ఫేవరట్ సినిమాల్లో ఫారెస్ట్ గంప్ కి అగ్రస్థానం. దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే లాల్ సింగ్ చద్దాకి భీజం పడింది. నటుడు అతుల్ కులకర్ణి దాదాపు పదేళ్ళు ఫారెస్ట్ గంప్ ని ఇండియా పరిస్థితులకు అడాప్ట్ చేశారు. 2018 వరకూ భారతదేశ చరిత్రలోని ప్రధాన ఘట్టాలని ఈ కథకి జోడిస్తూ మార్పులు చేస్తూనే వున్నారు. కారణం ఫారెస్ట్ గంప్ అంతటి క్లిష్టమైన కథ. దీనికి కథ అనడం కంటే ఒక మనిషి జీవితం, ఒక దేశ చరిత్ర అనడం సబబు. దర్శకుడు రాబర్ట్ జెమెకిస్ ఫారెస్ట్ గంప్ లో చేసిన మ్యాజిక్ మామూలుది కాదు. గంప్ క్యారెక్టర్ తో అమెరికా చరిత్రని, ప్రధాన ఘట్టాలని అద్భుతంగా డాక్యుమెంట్ చేశారు. మామూలు కథకి వున్నట్లు ఒక బిగినింగ్, ట్విస్ట్ , ఎడింగ్ వున్న సినిమా కాదిది. ఒక మనిషి ప్రయాణంలో ఒక దేశ చరిత్రని ఆవిష్కరించిన చిత్రమిది.
చాలా మంది ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ఈ సినిమాని రిమేక్ చేయాలనీ భావించారు. కానీ కుదరలేదు. అసలు ఈ సినిమా రిమేక్ రైట్స్ కోసం దాదాపు పదేళ్ళు ఎదురుచూడాల్సి వచ్చింది. రిమేక్ రైట్స్ పొందడంలో రాధిక చౌదరి సహాయపడ్డారు. తమిళనాడుకి చెందిన రాధిక తెలుగులో తప్పు చేసి పప్పుకూడు, శీను వాసంతి లక్ష్మీ లాంటి సినిమాల్లో నటించారు. తర్వాత ఆమె అమెరికాలో దర్శకురాలిగా స్థిరపడ్డారు. రీమేక్ రైట్స్ విషయంలో ఆమె కీలక పాత్ర పోషించారు. లాల్ సింగ్ చద్దా కి ఆమెనే ఎక్సిక్యూటివ్ ప్రొడ్యుసర్. రీమేక్ రైట్స్ వచ్చిన తర్వాత 2019లో సినిమాని అనౌన్స్ చేశారు. ఐతే కరోనాతో షూటింగ్ ఆలస్యమైయింది. ప్రపంచ చరిత్రలో కరోనా ఒక చీకటి అధ్యాయం. ఈ ఎపిసోడ్ కూడా లాల్ సింగ్ లో కనిపిస్తుందని సమాచారం వుంది.
నిజానికి ఫారెస్ట్ గంప్ రీమేక్ చేయడమే ఒక సాహసం. ఆ సాహసాన్ని సవాల్ గా తీసుకున్నాడు అమీర్ ఖాన్. ఆయన శక్తి సామర్ధ్యాలపై ఎలాంటి అనుమానాలు లేవు. గంప్ పాత్రకి ధీటుగా నటించే ప్రతిభ అమీర్ కు వుంది. అయితే ఫారెస్ట్ గంప్ లోని ఆత్మని ఇండియన్ స్క్రీన్ పై ఎలా తీసుకొస్తారనేది చాలా ఆసక్తికరమైన అంశం. ఇప్పటికి రిలీజైన ట్రైలర్ చూస్తుంటే . ఫారెస్ట్ గంప్ ఆత్మని పట్టుకున్నట్లే కనిపిస్తున్నారు. అమీర్ ఖాన్ నుండి సినిమా వచ్చి చాలా కాలమైయింది. ఈ సినిమా కోసం అమీర్ ఫ్యాన్స్ తో పాటు ఫారెస్ట్ గంప్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.