చీపురుతో అవినీతిని తుడిచేస్తానంటూ రాజకీయాల్లోకొచ్చిన అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ మంచి నీటిని సరఫరా చేసే ట్యాంకర్ యజమానుల నుంచి రెండున్నర కోట్ల రూపాయలు లంచంగా స్వీకరించారనేది ఆరోపణ. మామూలు పరిస్థితుల్లో దీన్ని ఎవరూ అంగీకరించరు.. ఆమోదించరూ.. అవినీతికి ఆమడ దూరంలో ఉంటామంటూ అధికారంలోకి వచ్చిన ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌కు మరో మంత్రివర్గ సహచరుడు సత్యేంద్ర జైన్ ఈ మొత్తాన్ని ఇస్తుండగా కళ్ళారా చూశానని మరో మంత్రి కపిల్ శర్మ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసిన దగ్గర్నుంచి రాజధానిలో కలకలం మొదలైంది. అది తప్పని ఖండించక తప్పని పరిస్థితి ఆప్‌కు ఎదురైంది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి దీనిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగారు. మీడియా ముందుకొచ్చిన ఆయన కపిల్ శర్మ ఆరోపణలు నిరాధారమైనవని చెప్పి నిష్క్రమించారు. వేరే ఏ ప్రశ్నకూ సమాధానమీయకుండా అంటే మీడియాను ఎదుర్కొనకుండానే ఆయన వెళ్ళిపోవడం సందేహాలకు తావిస్తోంది.
అరవింద్ నిజంగానే లంచం తీసుకున్నారా. అసలాయన లంచం తీసుకున్న నైజమున్న వ్యక్తేనా అనే సందేహాలు ఢిల్లీ ప్రజలలో అలముకున్నాయి. ఇది కూడా భారతీయ జనతా పార్టీ ఆడుతున్న నాటకం కాదు కదా అనే వాదనా మొదలైంది.
నిజం కాకపోతే కేజ్రీవాలే స్వయంగా ఖండించవచ్చు కదా. ఎందుకు ఆయన మీడియా ముందుకు రాలేదని ప్రశ్నలకు సమాధానం లేదు. అందరికీ శకునం చెప్పే బల్లి తానే కుడితెలో పడ్డట్టుగా కేజ్రీవాల్ పరిస్థితి తయారైంది. ఈ సమస్య నుంచి ఆయనెలా బయటపడతారనేది ఆసక్తికరం. తమిళనాట రాజకీయ నాటకాన్ని రక్తికట్టించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కేజ్రీవాల్ పని పట్టాలనుకుంటున్నట్లు సుస్పష్టమైపోయింది. ఎన్నో సార్లు కేజ్రీవాల్‌ను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించింది. ఇప్పుడు లభించిన అస్త్రం తిరుగులేనిది. కేజ్రీవాల్ దగ్గర సమాధానం లేనిదీనూ. ఆప్ మంత్రివర్గంలో తానొక్కడినే మచ్చలేనివాడినని కపిల్ శర్మ చెప్పడం.. ఆయన వెనుక బీజేపీ ఉందనే అనుమానాలకు తావిస్తోంది. కొరకరాని కొయ్యలా తయారైన ఢిల్లీ ముఖ్యమంత్రిని జైలుకు పంపించడానికి సైతం కేంద్రం సంశయించబోదు. కేజ్రీవాల్ నేరుగా ప్రధాన మంత్రినే లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పించారు. ఆయన డిగ్రీ కూడా నకిలీదేనని నిరూపించడానికి ప్రయత్నించారు. ఏదిఏమైనా రాజకీయ యవనికపై ఆసక్తికర సన్నివేశాలు దక్షిణాది తమిళనాట నుంచి దేశ రాజధానికి బదిలీ అయినట్లే కనిపిస్తోంది.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి