ఆగస్టు 15న బాక్సాఫీసు దగ్గర భీకరమైన పోటీ ఉంది. ఓ వైపు డబుల్ ఇస్మార్ట్, మరోవైపు మిస్టర్ బచ్చన్ విడుదలకు రెడీ అయ్యాయి. వాటితో పాటు తమిళం నుంచి ‘తంగలాన్’ వస్తోంది. మూడూ పెద్ద సినిమాలే. వీటి మధ్య ‘ఆయ్’ కూడా 15నే వస్తున్నామంటూ ప్రకటించుకొంది. బన్నీ వాసు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ఆయ్. హీరోకి ఒకట్రెండు సినిమాల అనుభవం ఉందంతే. హీరోయిన్ కొత్త. దర్శకుడికీ అంతే. ఓరకంగా పెద్ద నిర్మాత నుంచి వస్తున్న చిన్న సినిమా ఇది. 15న ఉన్న విపరీతమైన కాంపిటీషన్ దృష్ట్యా ఈ సినిమాని వాయిదా వేస్తారనుకొన్నారంతా. కానీ ‘ఆయ్’ పోటీ నుంచి వెనుకడుగు వేయట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 15నే వద్దామని ఫిక్సయిపోయింది. అందుకే ప్రమోషన్లు కూడా మొదలెట్టేశారు. మీడియా ఇంటర్వ్యూలు కూడా శనివారం నుంచే మొదలైపోయాయి.
గీతా ఆర్ట్స్ చేతిలో కొన్ని థియేటర్లు ఉన్నాయి. కాబట్టి ఎంత పోటీ ఉన్నా ‘ఆయ్’కంటూ కొన్ని థియేటర్లు ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా ‘ఆయ్’ ఓ సరదా సినిమా. గోదావరి పల్లెటూరు, ఆ విజువల్స్, మంచి పాటలూ, కామెడీ ఇవన్నీ మిక్స్ చేసిన మిక్చర్ పొట్లాం. కాబట్టి ఆయ్ ఈ సినిమాల మధ్య ప్రత్యేకంగా నిలబడే ఛాన్సుంది. కానీ ఎంత చెప్పుకొన్నా.. మాస్ ఆడియన్ అనేవాడు ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వైపే చూస్తుంటాడు. ఆ తరవాతే ‘ఆయ్’ వరకూ వస్తాడు. మధ్యలో విక్రమ్ సినిమా ‘తంగలాన్’ ఉంది. సిరియస్ సినీ గోయర్స్ ‘తంగలాన్’ వైపు ప్రత్యేకమైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ బన్నీ వాస్ ఈ విషయంలో రిస్క్ చేయడానికే సిద్ధ పడ్డాడు. చూడాలి మరి ఏం అవుతుందో?