ఈమధ్య నిర్మాతలు తెలివి మీరిపోయారు. తమ బ్యానర్లో వస్తున్న సినిమాల్ని టోకున ఓటీటీ, శాటిలైట్ ఛానళ్లకు అమ్మేస్తున్నారు. బ్యానర్ లో ఒక్క పెద్ద సినిమా ఉంటే చాలు. ఆ క్రేజ్‌తో మిగిలిన చిన్న సినిమాలూ అమ్ముడుపోతున్నాయి. ‘ఆయ్’ విషయంలో ఇదే జరిగింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో నిర్మించిన చిత్రం ‘ఆయ్’. ఈనెల 15న వస్తోంది. ఈ సినిమాకు శాటిలైట్, ఓటీటీ బిజినెస్ జరిగిపోయింది. అది కూడా మంచి రేటుకు. దీనంతటికీ కారణం ‘తండేల్’.
Also Read : ‘కోటి’ రూపాయల వర్షమండీ.. ఆయ్!
నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో గీతా ఆర్ట్స్‌లోనే రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. ప్రాజెక్ట్ పరంగా మంచి క్రేజ్ ఉంది. అందుకే ‘తండేల్’ ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ కొనేసింది. శాటిలైట్ జీ 5 ఖాతాలోకి వెళ్లింది. అయితే దీంతో పాటు ‘ఆయ్’నీ అమ్మేశారు. నెట్ ఫ్లిక్స్ ద్వారా ఆయ్కు రూ.6.5 కోట్లు, జీ 5 ద్వారా రూ.3 కోట్లు దక్కాయని తెలుస్తోంది. అంటే దాదాపుగా రూ.10 కోట్లు నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చేసినట్టు. పెద్ద నిర్మాణ సంస్థలకు ఇదో సౌలభ్యం. తమ సంస్థ గుడ్ విల్ ఇలా చిన్న సినిమాలకు వాడుకోవొచ్చు. పెద్ద సినిమాలతో పాటు, చిన్న సినిమాల్నీ గంపగుత్తగా ఓటీటీలకు ఇచ్చేయొచ్చు. ‘ఆయ్’ కు ఇది ప్లస్ పాయింట్ గా మారింది.