పాకిస్థాన్ సైన్యానికి చిక్కిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ సురక్షితంగా స్వదేశానికి చేరారు. అభినందన్‌ను పాక్ ఆర్మీ అధికారులు వాఘా సరిహద్దు వద్దకు తీసుకు వచ్చి భారత అధికారులకు అప్పగించారు. వెంటనే.. అభినందన్‌ను ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఢిల్లీకి తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించి చికిత్స అందించనున్నారు. అంతకు ముందు.. అప్పగింత లాంఛనాలు పూర్తి చేయడానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ కీలక అధికారి లాహోర్ వెళ్లారు. ఆ లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత రెడ్ క్రాస్ బృందం నేతృత్వంలో అప్పగింత వ్యవహారం నడిచింది. అంతకు ముందు వాఘా బోర్డర్ వద్దకు అభినందన్‌ను అప్పగిస్తే…కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని.. ఆయన కోసం.. ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేక విమానం పంపుతామని.. భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు విజ్ఞప్తి చేసింది.
అయితే పాకిస్తాన్ మాత్రం ఈ విజ్ఞప్తిని అంగీకరించలేదు. తాము వాఘా బోర్డర్ వద్దే అప్పగిస్తామని స్పష్టం చేసింది. ఆ ప్రకారమే అప్పగించింది. అభినందన్ అప్పగింత సందర్భంగా.. వాఘా సరిహద్దు వద్ద ఉదయం నుంచి.. ఉద్విగ్న భరిత వాతావరణం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఇక అన్ని భాషల మీడియా ప్రతినిధులూ.. హడావుడి చేశారు. చివరికి అధికారులు వాఘా వద్దకు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది.
దేశం మొత్తం వాఘా బోర్డర్ వైపు చూస్తూంటే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం ఎన్నికల ప్రచార ర్యాలీల్లో బిజీగా ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో.. తమిళనాడులో బహిరంగసభలో ప్రసంగించిన ఆయన.. తమిళుడైన అభినందన్ ను చూసి.. దేశం మొత్తం గర్విస్తోందని చెప్పుకొచ్చారు. టెర్రరిజంపై యుద్ధంలో విపక్ష పార్టీలు కలసి రావడం లేదని.. వారంతా ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని.. ఆరోపణలు చేశారు. ఆ తర్వాత కేరళ ఎన్నికల ప్రచారం.. ఆ తర్వాత ఏపీ ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉంటారు. అభినందన్ అప్పగింత ఇష్యూనూ.. మోడీ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు.