ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేతల ఆగడాలు ఎంత దారుణంగా ఉంటున్నాయో తరచూ సాక్షాధారాలతో సహా బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం చెప్పిన వారికి రుణాలివ్వలేదని బ్యాంకుల ముందు చెత్త పోసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు అంతకంటే దారుణంగా తిరుపతి ఎయిర్‌పోర్టు విషయంలో ప్రవర్తిస్తున్నారు. ఎయిర్ పోర్టు సిబ్బంది కాలనీకి.. ఎయిర్‌పోర్టుకు నీళ్లు ఆపేశాయి. ట్యాంకర్లతో తెప్పించుకుంటున్నారని.. సిమెంట్ రోడ్లను తవ్వేశారు. ఎయిర్ పోర్టు కు..ఎయిర్ పోర్టు ఆఫీసర్ల ఇళ్లకు.. మౌలిక సదుపాయాలు వెళ్లకుండా నిలిపివేశారు.
ఇదంతా ఎవరు చేస్తున్నారంటే.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు.. తిరుపతి రెండో డిప్యూటీ మేయర్. ఆయన ఇటీవల బొత్స సత్యనారాయణకు స్వాగతం చెప్పడానికి మందీమార్భలంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అలా ఎయిర్‌పోర్టులోకి రావడానికి కుదరదని.. బయటే స్వాగతం చెప్పాలని అధికారులు అడ్డుకున్నారు. అప్పుడే ఎయిర్‌పోర్టు అధికారులపై మండిపడ్డ అభినయ్ రెడ్డి… అసభ్యంగా దూషించారు. అయినా ఒప్పుకోకపోవడతో రెండో డిప్యూటీ మేయర్‌ను కాబట్టి చేయాల్సింది చేస్తానంటూ రెచ్చిపోతున్నారు.
ఎయిర్‌పోర్టుకు నీరు వెళ్లే పైప్ లైన్ ఆపేశారు. ట్యాంకర్లు వెళ్లకుండా ఏ పైప్ లేకున్నా.. మరమ్మతుల పేరుతో తవ్వేశారు. డ్రైనేజీ మరమ్మతుల పేరుతో మున్సిపల్ ఉద్యోగులతోనే తవ్వించారు. దీంతో ఎయిర్‌పోర్టు డైరక్టర్‌తో పాటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా తప్పు చేస్తున్నారని ఎయిర్‌పోర్టు డైరక్టర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదు. తన కుమారుడ్ని అడ్డుకున్నందుకు అనుభవించాల్సిందే అన్నట్లుగా ఆయన మాట్లాడారు.
ఇప్పుడీ అంశం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లే అవకాశం ఉంది. అధికారం ఉందని ఎందటి అరాచకానికైనా పాల్పడే గుణంతో వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. నీళ్లు ఆపడం.. ట్యాంకర్లు కూడా వెళ్లకుండా రోడ్లు తవ్వడం అంటే అంత కన్నా వినాశకర మనస్థత్వం ఉండదని అంటున్నారు. గతంలో బ్యాంకుల ముందు చెత్త వేసినప్పుడే కేంద్రం సీరియస్‌గా స్పందించి ఉంటే.. ఇలాంటి పనులు చేయడానికి వైసీపీ నేతలు భయపడేవారు. కేంద్రం కూడా.. ఇలాంటి రాజకీయ నేతల నుంచి కనీసం తమ పరిధిలో ఉన్న వారిని రక్షించడలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.