భారత్ – పాకిస్తాన్ మధ్య పెరిగిపోతున్న ఉద్రిక్తతలను తగ్గించి.. శాంతి స్థాపన కోసం.. ఇమ్రాన్ ఖాన్.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ దేశ సైన్యానికి చెందిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను.. శుక్రవారం బేషరతుగా విడుదల చేస్తున్నట్లు ఆ దేశ పార్లమెంట్లో ప్రకటించారు. మొదటగా.. చర్చలకు అంగీకరిస్తేనే… అబినందన్ ను విడుదల చేస్తామని.. పాకిస్తాన్ ప్రకటించింది. కానీ అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో.. చివరికి అభినందన్ ను విడుదల చేయాలని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయించుకున్నారు. తమ లక్ష్యం శాంతి స్థాపనేనని.. ఇమ్రాన్ ఖాన్ చెబుతున్నారు.
పాకిస్తాన్ కు ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే.. బేషరతుగా.. అభినందన్‌ను విడుదల చేయాలన్న డిమాండ్లు భారత్ వైపు నుంచే కాదు.. ప్రపంచంలోని పలు దేశాల నుంచి వచ్చాయి. అభినందన్.. భారత్‌లో ప్రవేశించిన పాకిస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్ ను తరిమికొట్టేందుకు మిగ్ 21 విమానంలో ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఆయన పాకిస్థాన్ లోకి వెళ్లిపోయారు. అక్కడ.. పాకిస్థాన్ బలగాలు.. అభినందన్ మిగ్ ను కూల్చివేశాయి. ఆయన ప్యారాచూట్ సాయంతో కిందకు దిగినా.. అక్కడ… సైనికులకు పట్టుబడ్డారు. దీంతో అభినందన్ విషయం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
యుద్ధఖైదీగా భావించి.. పాకిస్థాన్ ఇబ్బంది పెడుతుందని అందరూ అనుమానించారు. పాకిస్థాన్ కూడా.. ఈ విషయంలో.. కాస్త గట్టిగానే ఉండాలనుకుంది. అయితే ఇప్పటికిప్పుడు.. యుద్ధంచేయడం కానీ.. ఉద్రిక్త పరస్థితులను కానీ పాకిస్తాన్ కోరుకోవడం లేదు. ఈ విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ పదే పదే చెప్పారు. ఆ కోణంలోనే.. పట్టుదలకు పోకుండా.. అభినందన్ వర్ధమాన్ ను విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో.. భారత్‌లో సంతోషం వెల్లి విరుస్తోంది.