గోరంతల్ని కొండంతలు చేయడం, ఏమీ లేని చోట కూడా మసిపూసి మారేడు కాయ చేయడం టీవీ ఛానళ్లకు బాగా అలవాటైపోయింది. కొన్ని ఛానళ్లు అత్యుత్సాహం ప్రదర్శించి – తామే ఫస్ట్ అనిపించుకోవాలన్న తొందర్లో అభాసు పాలవుతుంటాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విషయంలో అదే జరిగింది.
గురువారం కృష్ణ కుమార్తె మంజుల ఓ ఫొటో షేర్ చేసింది. అందులో కృష్ణ తో సహా ఆయన కుటుంబ సభ్యులున్నారు. అందరూ నవ్వుతూనే ఉన్నారు. కానీ ఏబీఎన్ వాళ్లకు మాత్రం కృష్ణ మొహం కొంచెం తేడాగా కనిపించింది. దాంతో `కృష్ణ ఆరోగ్యానికి ఏమైంది` అంటూ కథనం ప్రసారం చేసింది. కృష్ణకు ఏదో అయిపోయిందని, అందుకే ఆ మొహం తేడాగా ఉందని, ఈ విషయంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వార్త ప్రసారం చేసింది.
నిజానికి ఆ ఫొటోని కాస్త జూమ్ చేస్తే.. కృష్ణ ఫేస్ మాస్క్ వేసుకున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అది.. దూరం నుంచి చూస్తే కాస్త తేడాగా ఉన్నమాట నిజం. కానీ.. నిశితంగా పరిశీలించకుండా ఆరోగ్యం ఏమైపోయిందో అంటూ.. కథనాలువండి వారిస్తే ఎలా.? అందులోనూ సూపర్ స్టార్ కృష్ణ విషయంలో..? ఈ కథనాలపై కృష్ణ కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. “ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దు“ అని మీడియాని కోరారు.