ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం తెలుగు రాష్ట్రాల నేతలు ఎందుకు బీజేపీపై పోరాడటం లేదనే లాజిక్ తో తెర ముందుకు వచ్చారు. అందరు నేతలు అలాగే ఉన్నారని.. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు బీజేపీతో చెలిమికిప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో చంద్రబాబునూ వదిలి పెట్టలేదు. అయితే ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీజేపీతో చెలిమి చేస్తున్నారని మాత్రం చెప్ప లేదు.. కేసీఆర్ , జగన్ మాత్రం పూర్తిగా వ్యక్తిగత ప్రయోజనాలు .. కేసుల కోసం బీజేపీకి లొంగిపోయారని.. డిసైడ్ చేసేశారు.
వివేకానందరెడ్డి హత్య కేసు.. ఢిల్లీ లిక్కర్ కేస వ్యవహారాల్లో దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించడం లేదని పూర్తి స్థాయిలో పై నుంచి వస్తున్న ఆదేశాల మేరకే వ్యవహరిస్తున్నాయన్న విషయాన్ని ఆర్కే గట్టిగా నొక్కి చెబుతున్నారు. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిన తర్వాత .. జరిగిన పరిణామాల్ని ఆయన విశ్లేషించారు. అవినాష్ రెడ్డిని వివేకా హత్య కేసులో ఏ 8గా చేర్చేసి సీబీఐచేతులు దులుపుకుందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ను పూర్తిగా దర్యాప్తు సంస్థలు మర్చిపోయాయన్నారు. అందుకే కేసీఆర్ బీజేపీని పల్లెత్తు మాటఅనడం లేదని.. జాతీయ రాజకీయాల గురించి అసలు మాట్లాడటం లేదని అంటున్నారు.
గతంలో రాజకీయ నాయకులు రాష్ట్రాల ప్రయోజనాల కోసం కేంద్రంతో లొల్లి పెట్టుకునేవారు. ఇప్పుడు తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఏపీ నుంచి అలాంటి ఒత్తిడి లేదు. కొన్ని కేసుల నుంచి జగన్ ను కాపాడితే చాలని ఏపీకి ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదన్నట్లుగా బీజేపీ ఉందని అంటున్నారు. అందులో నిజం కూడా ఉంది. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు టీడీపీ, బీజేపీ మధ్య రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓ యుద్ధం జరిగేది. ఆ ప్రాజెక్టు.. ఈ ప్రాజెక్టులు.. నిధులు అనే మాటలే వినిపించేవి. కానీ ఇప్పుడు ఏదీ వినిపించడం లేదు. మొత్తంగా కేసుల వ్యవహారమే తేట తెల్లమవుతోంది.
అయితే గతంలో బీజేపీపై పోరాడినా ప్రజలు తిరస్కరించడంతోనే ఇవాళ టీడీపీ మళ్లీ జాతీయ రాజకీయాల జోలికి పోవడం లేదని.. గతంలో బలపర్చి ఉంటే.. ఎంతో కొంత చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి ఉండేవారని పరోక్షంగా తన కొత్తపలుకు ద్వారా సందేశం ఇచ్చారు. కారణం ఏదైనా… తెలుగు నేతలంతా బీజేపీ అధికారం ముందు సలాం అంటున్నారు. ఇక్కడ వారి వల్ల ఆయా రాజకీయ పార్టీలకు ఎలాంటి సమస్య రాదు కాబట్టి… సన్నిహితంగా ఉంటున్నామని ప్రచారం జరిగినా లైట్ తీసుకుంటున్నారు