టైం బ్యాడ్ అయితే బ్యాడ్ ఆలోచనలే వస్తాయని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలపై ఒక్క మాటలో తేల్చేశారు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. తన వారాంతపు ఆర్టికల్ కొత్తపలుకులో ఈ సారి కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రయత్నాలపై సుదీర్ఘంగా ప్రస్తావించారు. కేసీఆర్ తప్పు చేస్తున్నారని ఉదాహారణలతో సహా చెప్పారు. ఢిల్లీ ఆశలు పెట్టుకుంటే గల్లీలో గల్లంతవడం ఖాయమని ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకూ గతంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతల గురించి సుద్దులు చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ప్రజల సొమ్మును ఇతర రాష్ట్రాల వారికి దానం చేస్తూ.. ఆయన గుర్తింపు పొందాలనుకుంటున్నారని అంతిమంగా అది చేటుచేస్తుందని తేల్చారు.
కేసీఆర్‌పై ఆర్కే వ్యతిరేకత పెంచుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి.. ఆయన తన కొత్త పలుకులో ప్రస్తావించిన అంశాలను సావధానంగా పరిశీలిస్తే.. కేసీఆర్ నిజంగానే అతిగా ఆశపడుతున్నారేమోనని ఎవరికైనా అనిపించకమానదు . తెలంగాణలో ఉన్న పదిహేడు లోక్ సభ స్థానాలు అవి కూడా మొత్తం టీఆర్ఎస్కు వస్తాయన్న గ్యారంటీ లేదు. ఢిల్లీలో మాట్లాడేది నెంబర్సే. పార్లమెంట్లో ఎంత బలం ఉందన్నదానిపైనే అక్కడ గౌరవం లభిస్తుంది. అందుకే ముందుగా ఇంట గెలవాలని… తన సహజశైలిలో ఆర్కే కేసీఆర్‌కు సలహా ఇచ్చారు. కేసీఆర్ రోజువారీ వ్యవహారాలు అన్నీ జ్యోతిష్యుల సలహా మేరకే నడుస్తున్నాయని చెప్పేందుకు ఆయన వెనుకాడలేదు. జ్యోతిష్యుడు చెప్పాడనే రెండు వారాల పాటు ఫామ్‌హౌస్‌కు పరిమితమై.. ఇప్పుడు తెలంగాణకు వస్తున్న మోదీకి ఎదురుపడలేక నేరుగా ఢిల్లీకి వెళ్లారని ఆర్కే చెబుతున్నారు. అందులో నిజముందో లేదో కానీ మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు కేసీఆర్ ఉన్నా.. ఆయన ఎదురెళ్లే పరిస్థితి లేదు.
ఇక ఏపీ పరిస్థితులు.. జగన్ పాలన గురించి చర్చించకుండా కొత్తపలుకు ముగిసే పరిస్థితి లేదు కాబట్టి.. నిన్నటి బర్నింగ్ టాపిక్ అయిన జగన్ లండన్ టూర్ గురించి ప్రత్యేకంగా రాశారు. నిజానికి జగన్ దావోస్ వెళ్లలేదని రూట్ మారారని.. ఆ రూట్ లో లండన్ చేరిందని మొదట చెప్పింది ఆంధ్రజ్యోతినే. ప్రో వైసీపీ మీడియా అంతా జగన్ లండన్ వెళ్లినప్పటికీ.. దావోస్ చేరుకున్నారని ప్రకటించేశాయి. కానీ ఆయన లండన్ వెళ్లారని ప్రకటించింది ఆంధ్రజ్యోతినే. ఈ విషయాన్ని మరింత ఫోకస్ వచ్చేలా చేసుకున్నారు ఆర్కే. జగన్ బుక్ చేసుకున్న అత్యంత లగ్జరీ జెట్ దగ్గర్నుంచి ఆయన రహస్య పర్యటనల వరకూ అన్నీ వివరించారు.
అప్పు పుట్టనిదే రోజు గడవని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇలా దుబారా చేయడం ఏమిటని.. గతంలో చంద్రబాబు హయాంలో చేసిన విమర్శలకు.. ఇప్పుడు చేస్తున్న దానికి పొంతనలేదని… చదివేవాళ్లు అర్థం చేసుకోవాలన్నట్లు ఆర్కే చెప్పుకొచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో జగన్, కేసీఆర్ క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని చెప్పకనే చెప్పారు. మొత్తంగా కేసీఆర్‌ను ఉద్దేశించి టైం బ్యాడ్ అయితే బ్యాడ్ ఆలోచనలే వస్తాయని నేరుగా చెప్పినప్పటికీ జగన్ పాలనపై వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా అదే అభిప్రాయాన్ని కల్పించారు.