ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలపై ఎప్పుడూ . .. ఎక్కడా లేనంత సానుభూతి చూపిస్తున్నారు. ఎంతగా అంటే.. అప్రకటిత సలహాదారుగా మారిపోయారు. ఆమెకు అన్యాయం జరిగిపోతోంది.. ఆర్థిక సమస్యల్లో ఉంది.. ఇప్పుడు బయట పడాలంటే తక్షణం ఆస్తులు పంచుకోవాలని సలహాలిస్తున్నారు. కానీ ఆస్తులు పంచుకోవడానికి జగన్ అంగీకరించడం లేదు. ఒక్క పైసా ఇవ్వనని ఆయన తెగేసి చెబుతున్నారు. మరి ఇప్పుడేం చేయాలి..? దీనికి కూడా ఆర్కే సలహా ఇచ్చేశారు.. జగన్ను రాజకీయంగా బలహీనం చేయాలి ?. జగన్ను రాజకీయంగా బలహీనం చేస్తేనే ఆందోళన చెంది ఆస్తులు పంచి ఇస్తాడు..? కానీ అది ఎలా..? దీనికి కూడా ఆర్కే సలహా ఇచ్చారు.. ఎలా ఉంటే.. ఏపీలో రాజకీయ పార్టీ పెట్టడమే !. ఏపీలో షర్మిల రాజకీయ పార్టీ పెట్టి జగన్ను రాజకీయంగా బలహీనం చేసే ప్రయత్నం చేస్తేనే అన్న భయపడి ఆస్తులు పంచుతాడనేది ఆర్కే లాజిక్.
వైఎస్ కుటుబంలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది బహిరంగ రహస్యం. జగన్, షర్మిల మధ్య విబేధాలు పెరిగిపోయాయన్నది కూడా నిజమే. అయితే ఆ వివాదాలు దేనికోసం అన్నదానిపై స్పష్టత లేదు. అన్నకు వ్యతిరేకంగా షర్మిల ఇప్పటికీ బహిరగంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఆస్తుల వివాదం విషయంలో ఆమె అసంతృప్తిగా ఉన్నారని ఇటీవల పలు కారణాలు బయటకు వచ్చాయి. ఆర్కే ఇంటర్యూలోనే సగం వస్తాయి.. రాకుండా ఎక్కడికి పోతాయని ఆమె స్పష్టం చేసింది. అదే సమయంలో సాక్షి పత్రిక యజమానినని కూడా ప్రకటించుకున్నారు. వీటిని బట్టి చూస్తే షర్మిల ఆస్తుల్లో వాటా ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది తేలిపోతోంది. అయితే జగన్ రెడ్డి వద్ద మాత్రం ఇలాంటి పప్పులేమీ ఉడకవని చాలా మందికి తెలుసు. ఆర్కేకి తెలియకుండా ఉండదని అనుకోలేం. తండ్రి సంపాదించిన ఆస్తులు అయితే వాటా ఇస్తారు కానీ .. జగన్ తన ఐడియాలను పెట్టుబడిగా పెట్టి ఆస్తులు సంపాదించారు. మరి ఎందుకు ఇస్తారు ?
అయితే తెలంగాణ లో రాజకీయ పార్టీ పెట్టి విపరీతంగా ఖర్చులు పెంచుకున్న షర్మిల ఆస్తులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఆమె గురించి బాగా తెలిసినట్లుగా ఉన్న ఆర్కే.., ఈ విషయంలో ఆమెకు అప్రకటిత సలహాదారుగా మారిపోయారు. నేరుగా సలహాలిస్తున్నారో లేదో తెలియదు కానీ.. తన పత్రిక ద్వారా మాత్రం సందేశాలు నేరుగానే పంపుతున్నారు. ఆ సందేశాల కోసమే ఈ వారం వారాంతపు ఆర్టికల్ ” కొత్తపలుకు”ని గరిష్ట స్థాయిలో ఉపయోగించుకున్నారు.
ఈ వారం ఆర్టికల్లో సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపు.. వాటిని సమర్థించుకోవడానికి పేదల్ని అడ్డుపెట్టుకుంటున్న వైనం.. ప్రశ్నించాల్సిన వారంతా మౌనం పాటించడం వంటివి ఎప్పట్లానే ప్రస్తావించారు. అయితే అవన్నీ జనానికి తెలిసినవే. ఆర్కే చెబితేనే తెలుసుకునే విషయాలు కావు. కానీ ఆర్కే ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ఈ సారి కూడా చెప్పారు. వాటి గురించి పక్కన పెడితే.. షర్మిలకు సలహాలివ్వడానికి.., జగన్పై ఆగ్రహం మరింత పెంచడానికి మాత్రం తన ఆర్టికల్గా పక్కాగా ఉపయోగించుకున్నారని అనుకోవచ్చు.