జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు. అయితే అది మాత్రమే కాదు జగన్ నూ ఓడించేందుకు ఓ చేయి వేయాల్సిందేనని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకు ద్వారా పరోక్ష సలహా పంపించారు. ఎందుకంటే జగన్ సాయంతో రేవంత్ రెడ్డి సర్కార్ ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తారన్నది ఆర్కే హెచ్చరికల సారాంశం.
జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని తనకు సమాచారం ఉందని కేసీఆర్ ఇటీవల ఓ టీవీలో కూర్చుని చెప్పారు. అదే సందర్భంలో ఎవరు గెలిచినా తమకేమీ ఫరక్ ఉండదని కూడా అన్నారు. కానీ కేసీఆర్ గురించి .. ఆయన మాటల గురించి బాగా తెలిసిన ఆర్కే.. అలా అనడంలో అసలైన అర్థాన్ని వెలికి తీశారు. ఏపీలో జగన్ మళ్లీ గెలిస్తే.. జగన్ సాయంతో.. ఇక్కడ రేవంత్ సర్కార్ ను కూల్చేందుకు ఖచ్చితంగా కేసీఆర్ ప్రయత్నిస్తారని ఆర్కే చెబుతున్నారు. అందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తే… ఖచ్చితంగా చాన్సులు ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తుంది. ఆర్కే కూడా అదే చెబుతున్నారు. అయితే తాను సలహా ఇచ్చినట్లుగా కాకుండా రేవంత్ రెడ్డికి ఆ మాత్రం తెలియదా అన్నట్లుగా రాసుకొచ్చారు.
గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ చేయాల్సినంత సాయం చేశారు. తన పోలీసు వ్యవస్థను వాడుకునే అవకాశం ఇచ్చారు. ఆర్థిక సాయం చేశారు. ట్యాపింగులు చేసి టీడీపీ ఆర్థిక వనరుల్ని పొలిమేర దాటకుండా ఆపేశారు. అంతేనా టీడీపీ అభ్యర్థుల ఆర్థిక మూలాలు తెలంగాణలో ఉంటాయి కాబట్టి అనేక మందిని బెదిరించారు. చాలా మందిని పార్టీ మారిపోయేలా చేశారు. కొంత మంది సీరియస్ గా పని చేయకుండా చూసుకున్నారు. అలాంటి సాయం రేవంత్ అనుకుంటే చేయగలరు.. కానీ ఇప్పటి వరకూ ఏమీ చేయలేదు. చేసే ఉద్దేశంలో కూడా లేరు. కానీ కాంగ్రెస్ పార్టీకి అంటే షర్మిలకు వీలైనంత సపోర్టు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి ఓడించే మిషన్ లో ఆర్కే.. పరోక్షంగా జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కొంత మందిని ఎగదోసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆర్కే సలహాలను చంద్రబాబు ఎక్కువగా పట్టించుకోవడం లేదు. టిక్కెట్ల సిఫారసులను కూడా లైట్ తీసుకున్నారు. అయినా ఆర్కే తనకు తెలిసిన నిజాల్ని.. ఇలా బయట పెడుతున్నారు. ఎలా చూసినా రేవంత్ కూడా జగన్ ఓటమిలో ఓ చేయి వేయాల్సిన అవసరం ఉందని ఆర్కే తన కొత్తపలుకులో తేల్చి చెప్పారు. రేవంత్ ఒకటి కాదు.. రెండు చేతులు వేసినా అది పరోక్షంగానే ఉంటుంది కానీ బయటకు తెలియదు.