కమ్మ – రెడ్డి సామాజికవర్గాలు ఒక్కటయ్యాయని కాపులు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటారా..? పవన్ కల్యాణ్ టీడీపీలో కలిసే ఆలోచనలో ఉంటే మానుకుంటారా ? అసలు కమ్మ – రెడ్డి సామాజికవర్గాలు ఒక్కటయ్యాయని ఎవరైనా అనుకుంటారా? . ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే మాత్రం అనుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న కులాల రాజకీయం మొత్తం జగన్ వ్యూహమేనని చెబుతున్నారు. ప్రతి వారాంతంలో రాసే “కొత్తపలుకు”లో ఈ సారి కులాల కుంపట్ల గురించే ప్రధానంగా ప్రస్తావించారు. ఇతర విషయాలేమో కానీ .. కమ్మ – రెడ్డి ఏకమవడం గురించి మాత్రం కాస్త లాజిక్ లేని విశ్లేషణ చేశారని ఎవరికైనా అనిపిస్తుంది
ఇదంతా ఎందుకంటే అంటే.. కాపు సామాజికవర్గం టీడీపీకి దగ్గరవకుండా ఉండటానికని.. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఉండటానికని ఆర్కే చెబుతున్నారు. అందుకే మోహన్ బాబును ప్రయోగించారని తేల్చేశారు. గెలిచిన తర్వాత మోహన్ బాబు వెళ్లి బాలకృష్ణను కలవడం..మనోజ్ వెళ్లి పవన్ కల్యాణ్ ను కలవడం వెనుక ఈ రాజకీయం ఉందంటున్నారు. ఇలా మొత్తం గజిబిజి చేసేసి రేపు టీడీపీతో పవన్ కల్యాణ్ జత కలిసినా ఓట్లు బదలాయింపు జరగకూడదనేది జగన్ ఆలోచన అని ఆర్కే విశ్లేషించారు. ఇక్కడ అసలు విషయ ఏమిటంటే టీడీపీ – పవన్ కలిస్తే అది డెడ్లీ కాంబినేషన్ అని జగన్ పదవి పోతుందని.. తీర్మానించేయడం.
“మా” ఎన్నికల్లో ఆంధ్రా రాజకీయాలున్నాయని ఎవరూ అనుకోవడం లేదు. ఇండస్ట్రీలో నెలకొన్న గొడవలు… ఆధిపత్య పోరాటమే ఉందని అనుకుంటున్నారు. కానీ ఆర్కే మాత్రం అందులో ఏపీ రాజకీయాలు ఉన్నాయంటున్నారు. అందులోనూ కులాల రాజకీయాలు ఉన్నాయంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మెగా క్యాంప్‌ను చిందరవందర రోజే ప్లాన్లు ఉన్నాయని అంతర్లీనంగా చెబుతున్నారు. చిరంజీవినిప వవన్ కల్యాణ్‌కు దూరం చేస్తారని కూడా అంటున్నారు.
మొత్తంగా చూస్తే ఆర్కే రాతల్లో లాజిక్ లేదని అనిపించవచ్చు కానీ.. ఆ విషయం ఆయనకూ తెలియకుండా ఉండదు. ఆయన రాసే వాటిల్లో అంతర్గత అర్థాలు.. ప్రయోజనాలు వేరుగా ఉంటాయని కొంత మంది చెబుతూ ఉంటారు. జగన్ పరిపాలన చేత కాక కులాల కుంపట్లు పెడుతున్నారన్న అభిప్రాయాన్ని కల్పించడానికి ఈ వారం కొత్తపలుకును వాడుకున్నారని చాలా మంది భావిస్తున్నారు. ఏదైనా ఒకప్పుడు జగన్ అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించిన ఆర్కే ఇప్పుడు ప్రతి నిర్ణయం వెనుక వ్యూహం ఉందంటున్నారు.