” వైఎస్ వివేకానందరెడ్డిని చంపడమే కాదు ఆ కేసులో ఎవర్ని ఇరికించాలో కూడా ముందుగానే ప్లాన్ రెడీ చేశారు. తాము అధికారంలోకి రాగానే దాన్ని బలపరిచేందుకు కొన్ని వాంగ్మూలాలను కృత్రిమంగా పోలీసు అధికారులతో రెడీ చేయించారు. కానీ కేసు సీబీఐకి వెళ్లడంతోనే ప్లాన్ బెడిసికొట్టింది. లేకపోతే ఈ పాటికి వైఎస్ వివేకా హత్య కేసులో అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి జైల్లో ఉండేవారు” అని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కొత్త కుట్ర కోణాన్ని తన వారాంతపు ఆర్టికల్ “కొత్తపలుకు” లో ఆవిష్కరింప చేశారు. ప్రభుత్వ పెద్దల క్రిమినల్ మైండ్ ఎవరూ ఊహించలేనంతగా ఉంటుందని ఆయన సాక్ష్యాలతో సహా నిరూపించేప్రయత్నం చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వతా రెండు సార్లు సిట్ బృందాలను మార్చారు. ఈ క్రమంలో వారు కొన్ని వాంగ్మూలాలు రెడీ చేశారు. వైఎస్ వివేకా హత్య గురించి బయటకు తెలియడానికి ముందే వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి పులి వెందుల బయలుదేరి వచ్చేస్తున్నారని … అంటే.. వారికి హత్య జరుగుతుదంని ముందే తెలుసుని అనుకునేలా ఆ వాంగ్మూలాలు సిద్ధం చేసింది. ముందే తెలుసుంటే దానర్థం వారే చేయించారని పోలీసులు కేసు పెట్టడం తర్వాత పని. కానీ కేసు అక్కడి వరకూ వెళ్లకుండా సీబీఐ చేతుల్లోకి వెళ్లడంతో వివేకా కుమార్తె, అల్లుడు బయపడ్డారని ఆర్కే చెబుతున్నారు
వైఎస్ సునీత, ఆమె భర్తపైనే ఆరోపణలు చేస్తూ కొద్ది రోజులుగా నిందితులు, అనుమానితులు విస్తృతంగా లేఖలు రాయడం.. పిటిషన్లు వేయడం కూడా చేస్తున్నారు. వాటికి జగన్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ పోలీసు అధికారులు ఆ వాంగ్మూలాలను క్రియేట్ చేశారంటే ముందు నుంచి అదే ప్లాన్లో ఉన్నారన్న అనుమానాలను ఆర్కే బయట పెట్టారు. ఆ వాంగ్మూలాల కథ.. అవి సృష్టించారు అనే విషయాన్ని సునీత భర్త ఇప్పటికే ఆధారాలతో సహా సీబీఐకి వివరించారు. తాను హత్య కేసు గురించి తెలిసేటప్పటికే తాను కర్నూలు రాలేదని.. హైదరాబాద్లోనే ఉన్నానన్నారు. ఒక వేళ కేసు సీబీఐ కి వెళ్లకపోతే ఈ కల్పిత వాంగ్మూలాల ద్వారా పోలీసులు నర్రెడ్డిని అరెస్ట్ చేసి ఉండేవారని.. ఆర్కే తన కథనంతో అందరూ ఊహించుకునేలా చేశారు.
వైఎస్ జగన్ ప్లాన్ తెలియక .. మొదట్లో సునీత తన అన్న రాజకీయంగా నష్టపోకూడదని ఆయన చెప్పమన్నదల్లా మీడియా ముందు చెప్పారు. కానీ చివరికి తమపైనే కుట్ర జరుగుతోందన్న విషయాన్ని ఆమె చాలా ఆలస్యంగా గుర్తించారు. అప్పటికైనా గుర్తించారు కాబట్టి బయటపడ్డారు కానీ.. లేకపోతే ఈ పాటికి జైలు పాలయ్యేవారన్నది ఆర్కే లాజిక్. తన కొత్తపలుకులో ఆమరావతి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. న్యాయం గెలిచిందని విశ్లేషించారు. ఈ అంశంపై ప్రభుత్వ కుట్రలపై ఆయన ఎన్నో సార్లు చెప్పిన విషయాలే మరోసారి చెప్పారు.