చంద్రబాబు కర్నూలులో లాస్ట్ చాన్స్ అన్నది తనకు కాదని.. రాష్ట్రానికని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తనదైన శైలిలో వారాంతపు ఆర్టికల్ కొత్తపలుకులో కవర్ చేశారు. జగన్ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే నిరంతరాయంగా సీఎంగా ఉంటారని ఆయన ఏపీ ప్రజల్ని భయ పెట్టే ప్రయత్నం చేశారు. జగన్ అదే్ చెబుతున్నారని.. గత నాలుగేళ్లలో జరిగిందేమిటో చూస్తే .. జగన్ నిరంతరాయంగా సీఎంగా ఉంటే.. జరిగేదే ఏమిటో కూడా స్పష్టంగా తెలుస్తుందన్నారు. అప్పులు చేసి.. ప్రజా ఆస్తులు తాకట్టు పెట్టి పంచడం.. వనరులు దోచుకోవడం మినహా జగన్ ఏమీ చేయలేదని.. ఇంకా ఎంత కాలం సీఎంగా ఉన్నా చేసేది అదేనని ఆర్కే చెబుతున్నారు.
అదే సమయంలో చంద్రబాబు సీఎం కాకపోతే ఆయనకు వ్యక్తిగతంగా జరిగే నష్టం ఏమిటని ఆర్కే ఓ భావనను ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేశారు. 14ఏళ్లు సీఎంగా అంత కాలం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు రికార్డును ఎవరూ చెరిపేయలేరని.. అలాంటి నేత మరోసారి ముఖ్యమంత్రి కాకపోతే ఆయనకు వచ్చే నష్టం ఏమీ ఉండదని తేల్చారు. కానీ రాష్ట్రానికి జరిగే నష్టం మాత్రం శాశ్వతగా ఉంటుందని విశ్లేషించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించాల్సింది.. రాష్ట్రం ఎవరి చేతిలో పెడితే బతుకుందనే కానీ.. రాజకీయ పార్టీల గురించి కాదని అంటున్నారు.
టీడీపీ పొత్తులపైనా ఆర్కే.. కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బీజేపీలో సోము వీర్రాజుతో పాటు మరో ఇద్దరు , ముగ్గురు మాత్రమే టీడీపీతో పొత్తు వద్దంటున్నారని.. మిగిలిన కోర్ కమిటీ సభ్యులంతా.. టీడీపీతో పొత్తు ఉండాలని కోరుకుంటున్నారని ఆయన అంటున్నారు. అసలు బలం లేని బీజేపీకి.. జనసేనతో పోటీ చేసినా సీట్లు రావు.. టీడీపీతో కలిసి పోటీ చేస్తే కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది. దాన్నివదులు కోవడం ఎందుకని బీజేపీ నేతలు అంటున్నారట. 2029 నాటికి మోడీకి కూడా చంద్రబాబు లాగే 80 ఏళ్లు వస్తాయని .. అప్పుడు ఎవరి రాజకీయం ఎలా ఉంటుందో చెప్పడం కష్టమని వారి భావనంటున్నారు.
గత కొన్ని వారాలుగా ఆర్కే తన కొత్త పలుకును పూర్తిగా తెలంగాణకు కేటాయిచారు. కేసీఆర్ రాజకీయ వ్యుహాలను ప్రభావితం చేసి..బీజేపీతో అంత ఘోరమైన ఫైట్ వద్దని నచ్చే చెప్పే ప్రయత్నం చేశారు.కానీ కేసీఆర్ మాత్రం పట్టించుకోలేదు. ఈ వారం చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలు అని చేసిన కామెంట్లపై మరింత చర్చ పెట్టేందుకు స్వయంగా రంగంలోకి దిగారు.