ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాల తర్వాత ఇక ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఏం రాస్తారోనని.. ఆయన మాటలకు హద్దులు ఉండవని అంచనాలు పెంచేసుకున్న వారికి ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే షాకిచ్చారు. ఆయన ఈ ఫలితాలపై పెద్దగా సంచలన విశ్లేషణలు చేయలేదు… కానీ చంద్రబాబుకు.. జగన్మోహన్ రెడ్డికి ఉచిత సలహాలు ఇచ్చేందుకు మాత్రం ఎక్కువ సమయం కేటాయించారు. ఇప్పుడే అయిపోయలేదని వచ్చే ఏడాదిలో ఏం చేయాలో చంద్రబాబుకు చాలా సలహాలిచ్చారు. అందులో కొత్తవేమైనా ఉన్నాయా అంటే లేవు. ఎప్పుడూ చెప్పేవే. అదే సమయంలో జగన్‌కూ చెప్పారు. ఫలితాలు చూసి తీరు మార్చుకోవాలని సలహా ఇచ్చారు.
ఆర్కే కీలకమైన విషయాలు బయటపెడితే తెలుసుకుని రాజకీయవర్గాలు చర్చించుకుంటారు కానీ సలహాలిచ్చే ప్రయత్నం మాత్రం పెద్దగా పట్టించుకోరు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడానికి చంద్రబాబే కారణం అని చెప్పడానికి ఆర్కే చాలా ప్రయత్నాలు చేశారు. పార్టీని పట్టించుకోలేదన్నారు. ప్రజలు ఆయన వెనకే ఉన్నారన్న భ్రమలో ఉన్నారన్నారు. నిజానికి చంద్రబాబుకు ఇలాంటి భ్రమ కల్పించిది ఆర్కేనే అనేది అందరికీ తెలిసిన విషయం. లగడపాటిని తీసుకుని ఆయన చాలా సార్లు చంద్రబాబును కలిసి సర్వేల పేరుతో మసిపూరి మారేడుకాయ చేసుకుని చివరికి దారుణ పరాజయంలో తాము కీలక భాగస్వాములయ్యారు. అయితే వీరిని నమ్మడం చంద్రబాబు చేసిన తప్పే కాబట్టి ఆర్కే చేసిన వాదనలో నిజం ఉందనుకోవచ్చు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తమ పార్టీ మీద ప్రభావం చూపవని సజ్జల అన్న మాటలు ఆత్మవంచనేనని చెప్పడానికి ఆర్కే ప్రయత్నించారు. నిజానికి ఏ పార్టీ అయినా ఇలా ఓడిపోయినా.. తమకు పరిస్థితులు ఎదురు తిరుగుతున్నాయని తెలిసినా బయటపడరు. ఇలాంటి విషయాల్లో వైసీపీ నేతలు ఇంకా గడుసుగా ఉంటారు. అందుకే బయటకు అలా చెప్పుకున్నారు. అంతర్గతంగా చక్కదిద్దుకుంటారో లేదో ఈ విషయంలోనూ ఆర్కే సాదాసీదా అభిప్రాయమే వెలిబుచ్చారు.
రాహుల్ గాంధీ అనర్హతా అంశాన్ని ఆర్కే ఖండించారు. నిజానికి ఆర్కే ఇలాంటి విషయాల్లో నిక్కచ్చిగా ఉంటారు. తప్పు అనిపిస్తే చెబుతారు. రాహుల్ గాంధీ పై అనర్హతా అంశాన్ని ఆయన అలాగే చెప్పారు.