వైసీపీ హయంలో ప్రత్యర్థులపై ఇష్టానుసారంగా మాట్లాడిన మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమాలపై ఏసీబీ దృష్టి సారించింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహరంలో జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇబ్రహీంపట్నంలోని తన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
అగ్రిగోల్డ్ భూములను సర్వే నెంబర్లు మార్చేసి మాజీ మంత్రి జోగి రమేష్ తన పలుకుబడితో తన కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూములను మార్చి, తన కుటుంబ సభ్యులపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అగ్రిగోల్డ్ బాధితులు ఆరోపిస్తున్నా ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆనాటి సీఎం జగన్ కు సన్నిహితుడని పేరుండటంతో అధికారులు కూడా ఎవరూ స్పందించ లేదు.
కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వ స్పందించింది. ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. అందులో భాగంగానే 15మంది ఏసీబీ అధికారులు ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.
జోగి రమేష్ కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకున్న అగ్రిగోల్డ్ భూములు ఇప్పటికే అమ్మేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో… ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న ఆసక్తి నెలకొంది.