చిరంజీవి 152వ చిత్రం `ఆచార్య`. అన్ లాక్ లో భాగంగా అనుమతులు ఇచ్చినా, షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. చిరు ఓకే అంటే.. షూటింగుకు రెడీ అవ్వాలని కొరటాల శివ భావిస్తున్నాడు. అయితే ఇక్కడ ట్విస్టు ఏమిటంటే… ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు వర్క్ ఇంకా జరుగుతూనే వుంది. ముఖ్యంగా చరణ్ ఎపిసోడ్‌కి సంబంధించి సన్నివేశాలు ఇంకా పూర్తి కాలేదట. వాటికి కొరటాల శివ ఫైన్ ట్యూన్ ఇస్తూనే ఉన్నాడని సమాచారం.
స్వతహాగా కొరటాల మంచి రచయిత. నచ్చింత వరకూ సన్నివేశాల్ని రాస్తూనే ఉంటారు. చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఈ సినిమాకి చాలా కీలకం. అందుకే.. ఆ సన్నివేశాలపై కొరటాల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు సమాచారం. చరణ్ ఎపిసోడ్లు ఇది వరకే రాసుకున్నా, ఇప్పుడు వాటికి మరింత మెరుగులు దిద్దుతున్నాడని తెలుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాల్ని రీ రైట్ చేస్తున్నాడట. లాక్ డౌన్లో భాగంగా సినిమా ఆలస్యమైంది. స్క్రిప్టుని సవరించుకోవడానికీ, సరిదిద్దుకోవడానికీ కావల్సినంత సమయం దక్కింది. అందుకే కొరటాల స్క్రిప్టుని తిరగ రాస్తున్నాడట. అన్నట్టు ఈ సినిమా కోసం.. తొలిసారి మరో రచయిత సాయం తీసుకున్నాడు కొరటాల. తనే… శ్రీధర్ సీపాన. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లకు తానే `మాట` సాయం చేస్తున్నాడట. `ఆచార్య` షూటింగ్‌కి చిరు రెడీ అయ్యే లోపు,.. ఈ స్క్రిప్టు వర్క్ పూర్తి చేయాలని చూస్తున్నాడు కొరటాల.