తెలుగుదేశంలో రేవంత్ రెడ్డి చుట్టూ చోటు చేసుకుంటున్న రాజకీయ ప్రకంపనలు ఇప్పట్లో ఆగేట్టు కనిపించడం లేదు. పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉండటంతో నాటకీయ పరిణామాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఏపీ టీడీపీ నేతలంతా రేవంత్ పై తీవ్రంగానే విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అనంతపురం పర్యటన సందర్భంగా, ఆయనతో రహస్య చర్చలు జరిపిన పయ్యావుల కేశవ్ కూడా ఇవాళ్ల స్పందించేశారు. ఇతర టీడీపీ నేతల తరహాలోనే ఆయనా విమర్శలు చేసేశారు. ఓవరాల్ గా పార్టీ నేతలంతా ఒకవైపు.. రేవంత్ రెడ్డి ఒక్కరే ఒకవైపు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. రేవంత్ యూ టర్న్ తీసుకుంటారా అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే, రేవంత్ పై ఇప్పటికిప్పుడే కఠిన చర్యలు తీసుకోవాలనే ఆత్రం పార్టీ వర్గాల్లో ప్రస్తుతం కనిపిస్తోంది. విదేశాల్లో ఉన్న చంద్రబాబు నాయుడుకి తాజా పరిస్థితులపై నేతలు అప్ డేట్స్ ఇస్తున్నారనీ, చర్యలు కూడా ఆయన వచ్చేలోపే ఉంటాయనే సూచనలు కనిపిస్తున్నాయి.
అయితే, చంద్రబాబు రాష్ట్రానికి వచ్చీరాగానే కలిసేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మొత్తం పరిణామాలపై ఆయన వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబుతో మాట్లాడిన తరువాతే కాంగ్రెస్ లో చేరుతారా లేదా అనే స్పష్టత వస్తుంది. కానీ, టీడీపీ నేతల వ్యూహం మరోలా ఉందని తెలుస్తోంది! రేవంత్ కు చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా దొరకనీయకుండా చేయాలన్నది వారి ఆలోచనగా ఉంది. అంతేకాదు, ప్రస్తుతం రేవంత్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కదా. ముందుగా ఈ పదవి నుంచి ఆయన్ని తక్షణమే తొలగించాలని తెలంగాణ టీడీపీ నేతలు తీర్మానించారు. ఆ తీర్మానం కాపీని విదేశాల్లో ఉన్న చంద్రబాబుకు పంపించినట్టు తెలుస్తోంది. గడచిన ఆరు నెలలుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూడ్డం మొదలుపెట్టారనీ, ఢిల్లీ పర్యటనలు తరచూ చేస్తూ రంగం సిద్ధం చేసుకున్నారంటూ అదనపు సమాచారాన్ని కూడా విదేశాల్లో ఉన్న ఏపీ సీఎంకు పంపారు. మంత్రి యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్ లపై రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని కూడా చంద్రబాబు నివేదించినట్టు చెబుతున్నారు.
పార్టీకి ఇంతగా ద్రోహం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలనీ, అపాయింట్మెంట్ కూడా ఇవ్వకూడదంటూ సదరు నివేదిక ద్వారా టీడీపీ నేతలు కోరినట్టు చెబుతున్నారు. వీలైనంత త్వరగా పార్టీ నుంచి రేవంత్ ను పంపించాలనే ఉద్దేశంతోనే టీడీపీలో పావులు కదులుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. కాబట్టి, చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చేలోగానే కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నివేదికపై చంద్రబాబు స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.