సినిమా అంటే.. నిర్మాతల్ని పీల్చి, పిప్పి చేయడమే. ఓ సినిమా తీయాలనుకోవడం, చెరకు మిషన్‌లో చెరుగ్గడ పెట్టడం రెండూ ఒకటే. రెమ్యునరేషన్ల పేరుతో నిర్మాతల్ని బాదేస్తున్నారు. దానికి తోడు సెట్లో హీరోలు, హీరోయిన్లూ కోరే గొంతెమ్మ కోర్కెలకు, వాళ్ల డిమాండ్లకూ నిర్మాతల గొంతుల్లో పచ్చి వెలక్కాయలు పడుతున్నాయి. అందుకు బోలెడన్ని నిదర్శనాలు. సాక్ష్యాలు.
తాజాగా ఓ టాప్ హీరోయిన్ డ్రై ఫ్రూట్స్ పేరుతో రూ.35 వేల బిల్లు వసూలు చేసిందట. ‘ఈ రోజుల్లో అదేమాత్రం’ అనుకొంటే ఖర్జూరంపై కాలేసినట్టే. ఇది సినిమా మొత్తం బిల్లు కాదు. ఒక్క రోజు బిల్లు. డ్రై ఫ్రూట్స్కే రూ.35 వేలేస్తే.. ఇక లంచ్, డిన్నర్ వరకూ వచ్చేసరికి నిర్మాత ప్రాపర్టీలో కొంత మేర అమ్ముకోవాల్సిందే. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ‘మీరేం తింటారో చెప్పండి.. మేమే తీసుకొస్తాం’ అని నిర్మాత చెప్పినా అమ్మడు వినిపించుకోదట. ”నేను కొనేవి.. తినేవి వేరే ఉంటాయి లెండి..” అంటూ ఆ బిల్లు ముక్కు పిండి వసూలు చేస్తోంది. నిజానికి ఈ రూ.35 వేల లెక్క చాలా చిన్నది. ఇలాంటి ఖర్చులు బోలెడన్ని ఉంటాయి. సెట్లో హీరోగారో, హీరోయినో అడుగు పెడితే.. వాళ్లిద్దరి స్టాఫే అటూ ఇటుగా 20మంది ఉంటారు. హీరోలు ఇక్కడివాళ్లే కాబట్టి సమస్య లేదు. హీరోయిన్లు చెన్నై నుంచో, బెంగళూరు నుంచో ఊడి పడతారు. వాళ్ల స్టాఫ్‌కి కావల్సిన వసతి.. నిర్మాతే భరించాలి. హీరోయిన్ ఏ స్టార్ హోటెల్ లో దిగితే.. అదే హోటెల్ లో వాళ్లకూ రూమ్ బుక్ చేయాలి
ఆ ఖర్చులన్నీ నిర్మాతలమీదే. అంతెందుకు ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు సైతం నలుగురు అసిస్టెంట్లతో సెట్లోకి అడుగు పెడుతున్నాడంటే పరిస్థితి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవొచ్చు. పేరున్న ఓ క్యారెక్టర్ హీరోకి ఎంతమంది టీమ్ పెడుతున్నారో.. అంతేమంది టీమ్ తనకూ కావాలని డిమాండ్ చేస్తున్నాడట. అసలే ఓటీటీలు, శాటిలైట్ రేట్లూ లేక ఓవైపు, థియేటర్‌కు జనాలు వస్తారో రారో అనే అనుమానాలతో మరోవైపు నిర్మాత బిక్కు బిక్కుమంటుంటే, దానికి తోడు ఈ రోకలిపోటు లాంటి వ్యవహారాలు మరింత కృంగ దీస్తున్నాయి. వీటి నుంచి నిర్మాతలు బయటపడేదెప్పుడో..?!