అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిపోర్టుపై అదానీ గ్రూప్ చాలా ఆలస్యంగా అయినా ఎదురుదాడి ప్రారంభించింది. తాము వెల్లడించిన విషయాలు తప్పు అయితే తమపై దావా వేయాలని సవాల్ చేస్తున్నా… మూడు, నాలుగు రోజులుగా పైపై వివరణలకే సర్దుకుపోయిన అదానీ గ్రూప్ తాజాగా ఆరు పేజీల వివరణతో ఎదురుదాడి చేసింది. ఇందులో అంతిమంగా చెప్పొచ్చిందేమిటంటే… హిండెన్ బెర్గ్ రిపోర్ట్ దేశంపై దాడి అని చెప్పడమే.
దేశంలో ఓ పద్దతి ప్రకారం.. లెక్క చూసుకుని మరీ దాడి చేస్తున్నారని అదానీ సంస్థ చెబుతోంది. ఇండియా వ్యవస్థల్ని తక్కువ చేయడంతో పాటు భారత్ వృద్ధిని తగ్గించడం లక్ష్యంగా ఈ దాడి జరుగుతోందని విశ్లేషించింది. ఇప్పటి వరకూ దేశంలో ఏం జరిగినా … దేశం కోసం … ధర్మం కోసం అని బీజేపీ జాతీయవాదాన్ని అడ్డు పెట్టుకునేది . ఇప్పుడు ఈ వ్యూహం అదానీ కూడా అందుకుంది. తమపై వస్తున్న ఆరోపణలను దేశంపై దాడిగా చిత్రీకరిస్తోంది.
గతంలో అమెరికాలో కూడా ఎన్నో కంపెనీలు తప్పుడు విధానాలకు పాల్పడి మూతపడ్డాయి. హిండెన్ బర్గ్ రీసెర్చ్ కూడా అలాంటికంపెనీల జాబితాలను వెల్లడించింది. అప్పుడెవరూ ఆ సంస్థ అమెరికాపై దాడి చేసిందని ఎవరూ అనలేదు. కానీ ఇండియాలో ఉన్న అడ్వాంటేజ్ ని అదానీ పక్కాగా ఉపయోగించుకంటున్నారు. అదానీ వ్యాపార సంస్థల లావాదేవీల గురించి ఇండియాలో ప్రతీ ఒక్కరికీ తెలుసు. అది గాలి బుడగ అని ఎప్పుడైనా పేలిపోవచ్చన్న అంచనాలున్నాయి.
కానీ రాజకీయ పరిస్థితులే అదానీ సంస్థల్ని నిలబడుతున్నాయని కార్పొరేట్ వర్గాలు కూడా అంచనా వేస్తాయి. ఇప్పుడు తన సంస్థలు.. లోపాలు.. మోసాలను .. అదానీ మరింత పకడ్బందీ చట్రంలో దాచేసుకుంటున్నారు. అదే జాతీయ వాదం.