భారత కుబేరుడు అదానీకి అంబానీ ఓ లెక్కే కాదు. ఆయనిప్పుడు బిల్ గేట్స్ ను కూడా దాటిపోయారు. బిల్ గేట్స్ ప్రపంచాన్ని మార్చేలా సాఫ్ట్ వేర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి సంపాదించిన దాని కన్నా.. ప్రజలెవరికీ పెద్దగా కనిపించని వ్యాపారాలు చేసే అదానీ ఎనిమిదేళ్లలో అత్యంత ఎక్కువ సంపాదించేసారు. అదానీది ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానం. ఫోర్బ్స్ ప్రకటించిన రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో మైక్రోసాఫ్ట్ స్థాపకుడు బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టేశారు.
ప్రస్తుతం అదానీ సంపద 115.5 బిలియన్ డాలర్లకు చేరుకోగా గేట్స్ కు ఉన్న 104.6 బిలియన్ డాలర్లు మాత్రమే. ఒకప్పుడు బిల్ గేట్స్ సంపద గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. ఆయనకు ఉన్న సంపదను నోట్లలోకి మార్చి పరిస్తే ప్రపంచం మొత్తం రెండు, మూడు సార్లు చుట్టి రావొచ్చని చెప్పుకున్నారు. ఇప్పుడు అదానీ గురించి అలా చెప్పుకోవచ్చు. అదాని సుడి ఇలా తిరిగితే త్వరలోనే ఆయన ఎలన్ మస్క్‌ను కూడా దాటిపోవచ్చు. దేశ ప్రజల జీవితాల్లో భాగం అయిపోయిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సంపద 90 బిలియన్ డాలర్లు మాత్రమే. ఆయనది పదో స్తానం.
చిరు వ్యాపారంతో ప్రస్థానం మొదలుపెట్టిన గౌతమ్ అదానీ జన బాహుళ్యంతో సంబంధం ఉన్న వ్యాపారాలు తక్కువ. పోర్టులు, ఎయిర్ పోర్టులు, గనులు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపారాలను కొనుగోలు చేయడం ద్వారా ఆయన కుబేరుడిగా ఎదిగారు. గత రెండేళ్లలో అదానీ గ్రూప్‌లోని కొన్ని నమోదు నమోదిత కంపెనీల షేర్లు 600 శాతం పెరిగాయి. ఇటీవల అదానీ గ్రూప్ టెలికాంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటి వరకూ ప్రపంచాన్ని మార్చిన వారంతా కుబేరులుగా ఉన్నారు. బిల్ గేట్స్ అయినా.. ఎలన్ మస్క్ అయినా వారి తీరు వేరు. కానీ అదానీ మాత్రం.. అలా ఎదిగిపోయారు. ఆయన నెంబర్ వన్ అయినా ఆశ్చర్యం లేదు.