ఏపీలో అదానీ సంస్థ పేరు వినిపించని రోజే ఉండటం లేదు. రహస్య జీవో ద్వారా విశాఖలో తొమ్మిది ఎకరాలు కట్టబెట్టేశారన్న ప్రచారం జరుగుతూ ఉండగానే ఒక్క రోజులోనే.. ఏటా దాదాపుగా రూ. నాలుగున్నర వేల కోట్ల విలువైన బొగ్గు సరఫరా కాంట్రాక్ట్ అదానీకి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో బొగ్గు కొరత ఉందని.. విదేశీ బొగ్గు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం టెండర్లు పిలిచింది. అదానీ, చెట్టినాడు సంస్థలు టెండర్లలో విజయం సాధించాయి. అదానీ 18 లక్షల టన్నులు, చెట్టినాడు సంస్థ 13 లక్షల టన్నులను సరఫరా చేయాలి.
కృష్ణపట్నానికి అదానీ సరఫరా చేస్తారు. టన్ను బొగ్గును రూ.24,500కు ఖరారు చేశారు. ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు చెట్టినాడు సంస్థ సరఫరా చేస్తుంది. ఆ సంస్థ రూ.19,500కు సరఫరా చేస్తుంది. ఇద్దరూ బొగ్గే సరఫరా చేస్తారు. కానీ అదానీకి మాత్రం టన్నుకు ఏకంగా రూ. ఐదువేలు ఎక్కువ ఖరారు చేశారు. మామూలుగా రివర్స్ టెండరింగ్ కూడా పూర్తి చేశారు. అసలు ఈ ప్రక్రియే విచిత్రంగా ఉంటుంది. ముందుగా ఎక్కువ కోట్ చేసి.. మళ్లీ అదే సంస్థ ఓ .. ఐదో.. పదో తగ్గిస్తుంది. అదే ఆదా చేశామని ప్రభుత్వం చెప్పుకుంటుంది.
ప్రతీ టెండర్‌కు న్యాయసమీక్ష చేస్తామని ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. కానీ బొగ్గు టెండర్లకు మాత్రం అలాంటి పని చేయడం లేదు. టెండరు విలువ రూ.100 కోట్లకు మించితే న్యాయ సమీక్షకు పంపాలన్న నిబంధనను ప్రభుత్వమే పక్కన పడేస్తోంది. కృష్ణపట్నం అయినా.. ఏపీ జెన్ కో అయినా .. ఎంత ఎక్కువ ధర పెట్టి బొగ్గు కొంటే.. అంత ఎక్కువగా భారం పడేది ప్రజలపైనే. వివిధ చార్జీల రూపంలో ప్రజల నుంచే వసూలు చేస్తారు.