గత వారం రోజులుగా దేశంలో అదానీ గ్రూపు కంపెనీలు రేపుతున్న దుమారం అంతా ఇంతా కాదు. ఆ కంపెనీలన్నీ గాలి మేడలని అమెరికాకు చెందిన హిండెన్‌బెర్గ్ రీసెర్చ్ ప్రకటించిన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆ సంస్థ షేర్లు కుప్ప కూలిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అదానీ మరో భారీ ఎఫ్ పీ వోకు వచ్చారు. రూ. 20 వేల కోట్లను స్టాక్ మార్కెట్ నుంచి సమీకరించుకుంటున్నారు.
అదానీ వ్యాపారాలకు మూల కేంద్రమైన అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.20,000 కోట్ల సమీకరణకు జారీచేయనున్న ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ జనవరి 27న ప్రారంభమయింది. తొలి రోజు ఒక శాతం బుక్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇష్యూ మంగళవారంతో ముగుస్తుంది. ఈ ఆఫర్ ద్వారా షేర్లు కొన్న వారికి 100 శాతం బుక్బిల్డింగ్ కింద పార్ట్లీ-పెయిడ్ షేర్లను కంపెనీ జారీచేస్తుంది. ఒక్కో షేరుకు రూ.3,112-3,276 ప్రైస్ బ్యాండ్‌తో షేర్లను ఆఫర్ చేస్తున్నారు. కనీసం నాలుగు షేర్లు కొనాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 8 నుంచి ఈ షేర్లు ట్రేడవుతాయి.
ఒక్కో షేరుకు రూ.3,112-3,276 ప్రైస్ బ్యాండ్ పెట్టినా ఇటీవల ఆ కంపెనీ సంక్షోభం గురించి బయటపడటంతో ప్రస్తుతం షేర్ ధర 2768 దగ్గరే ఉంది. అది మరింత కుంగిపోయే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అదానీ ఎఫ్ పీ వోకు ఎంత ఆదరణ ఉంటుందన్నది మార్కెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సోమవారం.. మంగళవారం… అదానీ గ్రూపునకు అత్యంత కీలకం.