ఏపీ పవర్ జెనరేషన్ కార్పొరేషన్ .. ఏపీజెన్కోలో తొలి సారి అదానీ గ్రూప్ ఎంట్రీ ఇచ్చింది. రాయలసీమ ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టు.. ఆర్టీపీపీకి బొగ్గు సరఫరా చేసే కాంట్రాక్టును దక్కించుకుంది. ఏపీ ప్రభుత్వం “అత్యంత పారదర్శకంగా” నిర్వహించే టెండర్లు – రివర్స్ టెండర్ల ప్రక్రియలో పాల్గొని అత్యంత తక్కువకు టెండర్ వేయడం ద్వారా.. ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. చాలా తక్కువ మొత్తానికి బొగ్గు కాంట్రాక్ట్ ఇచ్చామని.. హ్యాండ్లింగ్ చార్జీల్లో ఎంతో ఆదా చేశామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కొన్నాళ్లుగా ఏపీ ప్రభుత్వం విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో అదానీ పేరు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏపీ జెన్కో కృష్ణపట్నం థర్మల్ విద్యుత్కేంద్రాన్ని ప్రైవేటుకు ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంటులోని రెండు థర్మల్ యూనిట్లనూ “సమర్థుల”కు 25 ఏళ్లపాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద లీజుకు ఇవ్వాలని తీర్మానించారు. ఆ సమర్థుడు అదానీనేనని విద్యుత్ ఉద్యోగులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణపట్నం పోర్టు ఇప్పటికే అదానీ గ్రూపు చేతుల్లో ఉంది. ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో అదానీకి బొగ్గు గనులు ఉన్నాయి. కృష్ణపట్నం ప్లాంటు అదానీ చేతికి వెళితే జెన్కోకు ఇక మిగిలేవి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు , విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ మాత్రమే. ఇప్పుడు అదానీకి బొగ్గు సరఫరా కాంట్రాక్ట్ ఇవ్వడం ద్వారా ఆర్టీపీపీలోకి కూడా అదానీ ఎంట్రీ ఇచ్చేసినట్లయింది. నిజానికి గతంలోనే ఆర్టీపీపీని అమ్మేయాలనుకున్నారు. కానీ వెనక్కి తగ్గారు. త్వరలో పరిస్థితుల్ని బేరీజు వేసి ఆ పనీ పూర్తి చేసే అవకాశం ఉందన్న గుసగుసలు ఉద్యోగుల్లో వినిపిస్తున్నాయి.