Adipurush movie review
రేటింగ్: 2.75/5
వాల్మీకి రచించిన మహోదాత్త గాధ రామాయణం. వాల్మీకి రామాయణ ఆధారంగా విభిన్న ప్రక్రియల్లో రామకథ విరాజిల్లింది. ఒక్క తెలుగులోనే అనేక చిత్రాలు రామాయణంగా ఆధారంగా రూపొందాయి. లవకుశ, సంపూర్ణ రామాయణం, సీతారామ కల్యాణం, సీతాకల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం, బాల రామాయణం, శ్రీరామరాజ్యం.. ఇవన్నీ రామాయణం ఆధారంగా రూపొందిన చిత్రాలే. ఇప్పుడిదే బాటలో ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’ వచ్చింది. రామకథ అంటే ప్రేక్షకుల మనసులో ఒక ముద్ర వుంది. అందుకు భిన్నంగా ‘ఆదిపురుష్’ ప్రచార చిత్రాలు కనిపించడం మొదట్లో చర్చకు దారితీసింది. దీంతో పాటు గ్రాఫిక్స్ నాసిరకంగా వున్నాయని విమర్శలు వచ్చాయి. ఐతే తర్వాత త్రీడీలో విడుదల చేసిన ట్రైలర్ విమర్శలకు సమాధానం ఇచ్చింది.
‘ఆదిపురుష్’ చుట్టూ పాజిటివ్ బజ్ వచ్చింది. రికార్డ్ బ్రేకింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రలలో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాయి ప్రభుత్వాలు. అలాగే చాలా మంది సెలబ్రెటీలు వేల సంఖ్యలో టికెట్లు కొని, అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు పంపిణీ చేసే వినూత్న కార్యక్రమం కూడా చేపట్టారు. ఇవన్నీ ఆదిపురుష్ పై వున్న అంచనాలకు అద్దం పట్టాయి. మరి ఇన్ని అంచనాలు మధ్య వచ్చిన ఈ చిత్రం ఆ వాటిని నిలబెట్టుకుందా? గతంలో వచ్చిన రామ కథలకు ఆదిపురుష్ మధ్య ఎలాంటి వ్యత్యాసాలు వున్నాయి? బాహుబలి తర్వాత మరో పాన్ ఇండియా విజయం కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ కు ఆదిపురుష్ ఆ విజయాన్ని ఇచ్చిందా?
ఆదిపురుష్ కథ వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందించామని సినిమా ఆరంభంలోనే ప్రకటన చేశారు. రామాయణంలో ఏడు కాండలు, 24 వేల శ్లోకాలు వున్నాయి. ఈ మొత్తాన్ని ఒక్కసారిగా కథ చెప్పాలంటే అసాధ్యం. అందుకే రామాయణంలో ఆరంభంలోనే నారదుడు వాల్మికికి రామకథని సంక్షిప్తంగా తెలుపుతారు. సినిమా భాషలో చెప్పాలంటే దీనిని సింగిల్ లైన్ ఆర్డర్ అనొచ్చు. ఆ సింగిల్ లైన్ ఆర్డర్ ని చెప్పుకున్నా అది సంపూర్ణ రామాయణమే అవుతుంది.
ఆదిపురుష్ లో చూపించిన కథ వరకూ చెప్పుకుంటే.. రాఘవుడు (ప్రభాస్) గుణవంతుడు. ధర్మం తెలిసినవాడు. పితృవాక్య పరిపాలకుడు. తండ్రికి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని విడిచి భార్య జానకి (కృతిసనన్), సోదరుడు శేషు (సన్నీసింగ్)తో కలిసి వనవాసం గడుపుతుంటాడు. లంకని ఏలుతున్న రావణ (సైఫ్ అలీఖాన్) తన సోదరి శూర్పణఖ చెప్పుడు మాటలు విని జానకిని అపహరిస్తాడు. అశోకవనంలో బంధిస్తాడు. జానకీని తీసుకురావడానికి వానర సైన్యంతో రావణనునిపై యుద్ధాని వెళ్తాడు రాఘవుడు. మరి రావణ సంహారం ఎలా జరిగింది ? శౌర్యపరాక్రమవంతుడైన రాఘవుడు రాక్షసులను ఎలా అంతమొందించాడు ? ఎలాంటి ధర్మాన్ని చాటి చెప్పాడనేది వెండితెరపై చూడాలి.
వాల్మీకి రామాయణం ఆధారంగా ఈ సినిమా తీశామని చెప్పిన దర్శకుడు అదే వరుసలో మరో మాట కూడా చెప్పాడు. సినిమాకి అనువుగా ఈ కథని చిత్రీకరీంచానని, ప్రామాణిక రామాయణం తెలుసుకోవాలంటే పండితులని సంప్రదించాలని కూడా ఒక సూచన లాంటింది చేశాడు. ఇలా చెప్పడానికి కారణం వుంది. ఇది వాల్మికీ రామాయణమే కానీ చిత్రీకరణలో పూర్తి స్వేఛ్చ తీసుకున్నాడు దర్శకుడు. ఈ కథకు తనదైన విజువైలేషన్ ఇచ్చాడు. అన్నీ తెలిసిన ఘట్టాలే అయినప్పటికీ చిత్రీకరణలో కొత్తదనం చూపించే ప్రయత్నం ఆది పురుష్ లో జరిగింది. ఐతే ఈ కొత్త ప్రయత్నం కొందరికి ఇదేం రామాయణ చిత్రీకరణ? అని ఆశ్చర్యపరచవచ్చు.
బాలకాండ, అయోధ్య కాండలని టైటిల్స్ లో కేవలం చిత్రాలతో చూపించి దర్శకుడు ..ఒక్కసారిగా శూర్పణఖ వృతాంతంలోకి వచేస్తాడు. అక్కడి నుంచి కథ మొదలౌతుంది. నీటిలో తప్పసు చేసుకుంటున్న రాఘవుడుని చూపించిన పరిచయ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో హాలీవుడ్ తరహాలో ఓ ఫైట్ సీక్వెన్స్ వస్తుంది. శూర్పణఖ గురించి వివరాలు తెలియకపొతే అసలు ఈ ఫైట్ ఎందుకు వచ్చిందనే అనుమానం కూడా కలుగుతుంది. శూర్పణఖ రావణుడి దగ్గరకి వెళ్ళే ముందు తనని తిరస్కరించిన రాఘవుడి పై రాక్షస సైన్యం వెంటబెట్టుకొని ఓ పెద్ద యుద్ధం చేస్తుంది. రాక్షస సైన్యాన్ని రాఘవుడు సంహరిస్తాడు. ఇక తన వల్ల కాదని రావణుడిని ఆశ్రయిస్తుంది శూర్పణఖ. ఈ వృతాంతం గురించి తెలియకపోతే అసలు రాఘవుడు ఎవరితో ఎందుకు యుద్ధం చేశాడనే క్లారిటీ వుండదు. ఇలాంటి క్లారిటీ లేని సన్నివేశాలు ఇందులో చాలా కనిపిస్తాయి. రామాయణం తెలిసిన వారికి ఆది పురుష్ ఒక్క కాండని కూడా సరిగ్గా చూపించలేకపోయినా అసంపూర్ణ రామాయణం అనిపిస్తుంది.
రామాయణాన్ని ఇది వరకూ చాలా మంది తీశారు. బాపు రామకథని సంపూర్ణంగా ఒక సినిమాలో పట్టించారు. నిడివి పరంగా చూసుకుంటే ఆది పురుష్ పెద్ద సినిమానే. బంగారు లేడీ మాయ, సీతాపహరణం, వాలి-సుగ్రీవుల యుద్ధం, హనుమంతుడి సాయం, లంకాదహనం, రామసేతు నిర్మాణం, లక్ష్మణుడి ప్రాణం – సంజీవని పర్వతం, రామరావణ యుద్ధం… ఇలా కీలక ఘట్టాలన్నీ ఆది పురుష్ లో వున్నాయి. ఐతే ఈ ఘట్టాలని చిత్రీకరణ పైనే ద్రుష్టిపెట్టిన దర్శకుడు.. అందులో వున్న ఎమోషన్ ని సరిగ్గా పట్టుకాలేదనిపిస్తుంది. నిజానికి వాల్మికీ రామాయణంలో చాలా హై ఎలివేషన్ సీన్స్ వున్నాయి. సీతని రావణుడు ఎత్తుకెళ్ళినప్పుడు కూడా ధైర్యంగా నిలబడ్డ రాముడు.. లక్ష్మణుడు కూలినప్పుడు మాత్రం చలించిపోతాడు. అసలు లక్ష్మణుడు లేని భూమండలమే వుండకూడదని బాణ ప్రయోగానికి సిద్దమౌతాడు. అంత ఎమోషన్ వున్న సన్నివేశం అది. కానీ ఆది పురుష్ లో ఆ అన్నదమ్ముల ప్రేమ మైత్రీ సరిగ్గా చూపించలేదు.
రామాయణం అంటే తండ్రి కొడుకుల కథ, అన్నదమ్ముల కథ, గురు శిష్యుల కథ, భార్య భర్తల కథ, గొప్ప స్నేహితుల కథ.. ఇలా అనేక కోణాల్లో ఈ కథ దర్శనమిస్తుంది. ఆది పురుష్ లో మాత్రం ఈ కోణాలు ఏవీ అంత బలంగా కనిపించకపోవడం ఒక లోపం. దర్శకుడు ఈ తరానికి తగట్టు ఈ కథని చూపించాలనే ఉద్దేశంతో ఈ కథని తీసి ఉండొచ్చు. హాలీవుడ్ అవెంజర్స్ సినిమాలు లాంటి పోరాట దృశ్యాలే అతని లక్ష్యం కావచ్చు. కానీ తరం ఏదైనా ప్రేక్షకుల మనసుని ఆకట్టుకునేది ఎమోషన్ మాత్రం. ఆ ఎమోషన్ ఇందులో కొరవడింది. ప్రధమార్ధం అంతా అరణ్య కాండ, కిష్కిందకాండ, సుందరకాండలోని ఘట్టాలని చూపించిన దర్శకుడు .. ద్వితీయార్ధం మొత్తం యుద్ధకాండకే కేటాయించాడు. యుద్ధం నిజంగానే రసవత్తరంగా వుంటుంది. ఎలాంటి డైలాగులు లేకుండా కేవలం ఆర్ఆర్ తోనే ఒక ఇరవై నిమిషాలు పాటు కేవలం యాక్షనే నడుస్తుంది. ఐతే రామకథకు హాలీవుడ్ టచ్ ఇవ్వాలకునే ప్రయత్నంలో.. పాత్రలు వాటి ప్రవేశం, వాటి ముగింపు లో స్పష్టత కొరవడుతుంది. రామ రావణ యుద్ధం.. అతి భీకరంగా జరిగింది. ఇంద్రజిత్, కుంభకర్ణుడు లాంటి రాక్షస వీరులతో రాఘవుడి సైన్యం చేసే యుద్ధం ఇంకా బలంగా చూపించే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది. చివరికి రావణుడు యుద్ధ భూమిలో దిగినప్పుడు.. రాముడే ఆశ్చర్యపోతాడని రాశారు వాల్మికి. నిజమే రావణుడు అంత తేజోవంతుడే. ఈ యుద్ధం రసవత్తరంగా వుంటుంది. కానీ అప్పటికే వార్ ఎపిసోడ్ సుదీర్గంగా సాగడంతో రావణ సంహారం అందులోనే కొట్టుకుపోతుంది తప్పితే ప్రత్యేకంగా అనిపించదు. దీనికి కారణం.. పాత్రలని, వారి ఎమోషన్ ని సరిగ్గా డిజైన్ చేయలేకపోవడమే.
రాఘవుడిగా ప్రభాస్ సరిగ్గా సరిపోయారు. ఆయన రూపం, విగ్రహం నిండుగా వుంది. రాముడుకి మీసాలు గెడ్డాలు ఏమిటనే విమర్శ మొదట్లో వచ్చింది. కానీ సినిమా చూస్తున్నపుడు ఓ పది నిమిషాల్లో ఆ రూపంతో పాటు ప్రయాణించేస్తాం. పోరాట సన్నివేశాల్లో తన ప్రతాపం చూపించారు ప్రభాస్. తన కెరీర్ లో నిలిచిపోయే పాత్ర ఇది. జానకి పాత్రలో చేసిన కృతి సనన్ హుందాగా కనిపించింది. ఆమె అభినయం కూడా బావుంది. ఇందులో లక్ష్మణుడు పాత్రలి శేషు అని పేరు పెట్టారు. లక్ష్మణుడికి శేషు అనే పేరు రామాయణంలో ఎక్కడా ప్రస్థావించలేదు. తర్వాత అవతారంలో ఆయనికి శేషు అనే పేరు వుంది. రామాయణ కాలంలో లేని పేరు పెట్టడం వక్రీకరణే. ఆ పాత్రకు సన్నీసింగ్ రాంగ్ ఛాయిస్ అనిపించింది. రాముడిని చూస్తే చాలు పులకించిపోతాడు లక్ష్మణుడు. అలాగే రాముడికి లక్ష్మణుడు అంటే అమితమైన ప్రేమ. కానీ ఇందులో అలాంటి ఒక్క సన్నివేశం కూడా లేదు. రావణుడిగా చేసిన శైఫ్ అలీ ఖాన్ మెప్పిస్తాడు. హనుమంతుడిగా చేసిన నటుడు కూడా ఆకట్టుకుంటాడు. మండోదరిగా సోనాల్ చౌహాన్ కనిపించింది. వాలీ, సుగ్రీవ, మిగతా వానర సైన్యం పాత్రలకు వింత రూపాలు ఇచ్చారు. ఇంద్రజిత్, విభీషణ పాత్రలు అంతగా రిజిస్టర్ కావు. రావణ సైన్యం కూడా వింతవింత ఆకారాల్లో కనిపిస్తుంది.
సాంకేతికంగా సినిమా బావుంది. త్రీడీ వర్క్ డీసెంట్ గా చేశారు. ఐతే చాలా వరకూ గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ లో తీసిన సన్నివేశాలే. అవి సులువుగా తెలిసిపోతుంటుంది కూడా. నేపధ్య సంగీతం బావుంది. వార్ సీన్స్ ని ఎలివేట్ చేసింది. మాటలు గురించి చెప్పుకుంటే ప్రామాణిక రామాయణంలోని మాటలే చాలా వినిపిస్తాయి. వాటిని సోషలైజ్ చేసే క్రమంలో కొంత అసహజంగా అనిపిస్తాయి.
నిజానికి రాముడు చాలా అందంగా అద్భుతంగా మాట్లాడతాడు. ఆయన నోటి వెంట ఒక్క తీవ్రమైన మాట కూడా రాదు. ఒకవేళ రాముడు ఎప్పుడైనా తీవ్రంగా ఒక మాట చెప్పాల్సి వస్తే దాన్ని చెప్పే విధానం కూడా అబ్బురపరుస్తుంది. సుగ్రీవుడు సీతని వెదకడానికి సాయం చేస్తానని మాట ఇచ్చి, దాన్ని మరచి రాసక్రీడల్లో తేలుతుంతాడు. సుగ్రీవుడి శైలిపై ఆగ్రహం వ్యక్తి చేసిన రాముడు లక్ష్మణున్ని పిల్చి.. ‘వాలి వెళ్లిన దారి ఇంకా తెరిచే వుంది’ అని సుగ్రీవునితో చెప్పు’’ అంటాడు. రాముడు వార్నింగ్ ఇస్తే ఇలా వుంటుంది. కానీ ఆది పురుష్ లో ఇలాంటి మాటల వినిపించలేదు. వానరసైన్యాన్ని ఉత్తేజపచేందుకు రాముడు చెప్పిన మాటలు మాత్రం ఒక మాస్ హీరో చెప్పినట్లే వుంటాయి. ప్రొడక్షన్ డిజైన్ కూడా వెరైటీగా వుంది. ముఖ్యంగా ఆ లంక సెటప్ మాత్రం జీవం లేనట్లే వుంటుంది. రామకథని తనదైన శైలిలో ప్రజంట్ చేయాలనుకున్నాడు దర్శకుడు ఓ రౌత్. చాలా చోట్ల ఆయన ఆలోచన బావుంది కూడా. ఐతే ఈ ప్రజంటేషన్ లో దర్శకుడు తీసుకున్న ఓవర్ లిబార్టీ రామకథలో ఆత్మలోపించినట్లనిపించింది. ఐతే బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో పోల్చుకుంటే.. ఆది పురుష్ మాత్రం బెటర్ సినిమానే.
రేటింగ్: 2.75/5