తమిళ నాట సంచలనాలు సృష్టిస్తున్న చిత్రం ‘మెర్శల్’. రికార్డుల హోరు, విమర్శల జోరుతో… ఈ సినిమా అక్కడ వార్తల్లో నిలుస్తోంది. తెలుగులో ‘అదిరింది’ పేరుతో శరత్ మరార్ విడుదల చేస్తున్నారు. రేపు (శుక్రవారం) విడుదల తేదీ ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ సెన్సార్ క్లియరెన్స్ రాలేదు. జీఎస్టీ, నోట్ల రద్దు, ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిని ఎండగడుతూ ఇందులో పదునైన డైలాగులు వాడారు. అవే ఇప్పుడు బీజేపీ నేతల కోపతాపాలకు కారణం అవుతున్నాయి. ఈ సినిమాని ఆపేయాలని, డైలాగుల్ని కత్తిరించాలని తమిళ నాట నిరశనలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు సెన్సార్ కష్టమవుతోంది. ఆయా సన్నివేశాల్ని తొలగిస్తే తెలుగులో సెన్సార్ సర్టిఫికెట్ మంజూరు చేస్తామని సెన్సార్ అధికారులు చెబుతున్నారు. అయితే అందుకు దర్శక నిర్మాతలు అంగీకరించడం లేదు. దాంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. తమిళంలో సెన్సార్ అయిన సినిమాని తెలుగులో ఎలా ఆపుతారు?? అనేది చిత్రబృందం ప్రశ్న. సెన్సార్ వాళ్లూ, దర్శక నిర్మాతలూ వెనక్కి తగ్గకపోవడంతో అదిరింది ఆగిపోయింది. ఈ సెన్సార్ వ్యవహారం తేలే వరకూ ‘అదిరింది’ తెలుగులో విడుదలయ్యే ఛాన్స్ లేదు.