ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు వైకాపాలో ఉన్నప్పటికీ ఆయనకు ఎన్నడూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అలవాటు లేదు కనుక వైకాపాలో ఆయన ఉనికి తెలియదు. అలాగే పార్టీ వ్యవహారాలలో ఎక్కడా చురుకుగా పాల్గొన్నట్లు కనబడరు. బహుశః తెర వెనుక ఉంటూ పార్టీ వ్యవహారాలూ చక్కబెడుతున్నరేమో తెలియదు. అటువంటి వ్యక్తిని వైకాపా రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడుగా నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకొన్నారు.
బహుశః ఆ కమిటీలో సభ్యుడుగా ఉన్న ఎం.వి. మైసూరా రెడ్డి రాజ్యసభ పదవీ కాలం త్వరలో ముగియబోతోంది. ఆయన స్థానంలో వేరొకరిని రాజ్యసభకు పంపాలని జగన్మోహన్ రెడ్డి నిశ్చయించుకొన్నట్లు తెలియడంతో ఆయన పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. కనుక కమిటీలో ఆయన స్థానాన్ని ఆదిశేషగిరి రావుతో భర్తీ చేస్తున్నారేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే నిజమయితే మైసూరా రెడ్డి ఇక పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోవచ్చని చెపుతున్నట్లే భావించవచ్చును. విశేషం ఏమిటంటే కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు వైకాపాలో కీలకపదవిలో ఉంటే, కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ వైకాపాకు బద్ద శత్రువు అయిన తెదేపాలో ఎంపిగా ఉన్నారు.