అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి అద్వానీ, మురళీ మనోహర్ జోషి రావాల్సిన అవసరం లేదని రామమందిరం ట్రస్ట్ ప్రకటించింది. ఎందుకంటే వారికి వయసు ఎక్కువైపోయిందని వారి ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతోంది. నిజానికి రామాలయం అనే అంశం అద్వానీ ట్రేడ్ ామర్క్ లాంటిది. మతపరమైన మందిరాన్ని రథయాత్రతో రాజకీయాంశం చేసి.. ఓ రకంగా ఇవాళ జరుగుతున్న ఈ మహా కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అద్వానీ.
కోట్ల మంది హిందువులకు ఆహ్వానం పలికి.. వేల మంది నాయకులకు స్వాగతం పలికి.. వందలాది వీఐపీలకు ఆతిథ్యం ఇస్తున్న రామమందిర ట్రస్టు అసలు మందిరానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన రథయాత్రికుడు లాల్ కృష్ణ అద్వానీని మాత్రం దూరం పెట్టింది. మీ వయసు పెరిగింది.. ఆరోగ్యం దృష్ట్యా.. హాజరు కావొద్దని “విజ్ఞప్తి” చేసింది.
అద్వానీ రథయాత్ర అనేక రాష్ట్రాల్లో రాజకీయాలను ప్రభావితం చేసింది.. అదే బాబ్రీ విధ్వంసానికి దారితీసింది. ఓటర్లను మతపరంగా విభజించి అనేక రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చింది. 1996లో అతిపెద్ద పార్లమెంటరీ పార్టీగా నిలబెట్టింది.
అద్వానీ యాత్ర బీజేపీలోనే కాదు… దేశరాజకీయాల్లోనూ చాలా మార్పులు తీసుకొచ్చింది. మెజారిటీ ప్రజలు ఓ వాదంవైపు మొగ్గు చూపడానికి దోహదపడింది. వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. రామమందిర నిర్మాణం ఇవన్నీ 90 ఏళ్ల వయసులో ఆనందాన్నిసంతృప్తిని ఇచ్చి ఉండొచ్చు…కానీ ఇప్పటి పరిస్థితుల్లో కాదు.
అద్వానీని వద్దనడానికి వయసు కారణం అని చెబుతున్నారు కానీ అదే 90 ఏళ్ల దేవేగెడను అహ్వానించడానికి ప్రత్యేక కమిటీ వేశారు. 85 ఏళ్లు దాటిన రతన్ టాటా వంటి వారిని పిలిచారు. అద్వానీకి ఆహ్వానం లేకపోవడానికి కారణం మోదీ మాత్రమే ఫోకస్ కావాలనుకోవడమేనని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో మరే ఇతర మహా “పురుష్” లు ఉండకూడదని మోదీ భావించారని చెప్పాల్సిన పని లేదంటున్నారు. పాపం అద్వానీ అని అందరూ జాలి చూపించడం తప్ప.. కనీసం బయటకు కూడా సానుభూతి వ్యక్తం చేయలేని పరిస్థితి బీజేపీలోనే ఉంది. ఇంకెరు రథయాత్రికుని గురించి పట్టించుకుంటారు ?