గౌతం సవాంగ్ సివిల్ సర్వీస్ అధికారి. ఐపీఎస్‌గా రిటైరయ్యారు. బలవంతంగా ముందే రిటైర్ చేసి… ఎపీపీఎస్సీ చైర్మన్ పోస్టు ఇచ్చారు. అయినప్పటికీ ఆయన సీనియర్ కాబట్టి అన్ని రకాల నియమనిబంధనలు స్పష్టంగా తెలుసు. కానీ అక్కడా పాటించలేకపోతున్నారు. డీజీపీగా ఉన్నప్పుడు కోర్టులతో చీవాట్లు తిన్నట్లుగా ఏపీపీఎస్సీ చైర్మన్‌గానూ తప్పడం లేదు. ఆయన నాయకత్వంలో వచ్చిన అసిస్టెంట్ మోటార్ వాహన ఇన్స్పెక్టర్(ఏఎంవీఐ) నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సస్పెండ్ చేసింది. దీనికి కారణం క్వశ్చన్ పేపర్ ఇంగ్లిష్ లో మాత్రమే ఉంటుందని నోటిఫికేషన్లో పెట్టడం.
ఎంత పెద్ద సివిల్స్ పరీక్ష జరిగినా క్వశ్చన్ పేపర్ ఇంగ్లిష్‌లో మాత్రమే ఉండదు. ఆ విషయం గౌతం సవాంగ్‌కు కూడా తెలిసే ఉంటుంది. మరి తెలుగు రాష్ట్రంలో ఒక్క ఇంగ్లిష్ లో మాత్రమే క్వశ్చన్ పేపర్ ఇస్తామంటే ఎలా సాధ్యమవుతుంది ?. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్‌లోనే ఉంటుందన్న రూల్‌పై ఓ అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా క్వశ్చన్ పేపర్ ఇస్తామని చెప్పడాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది తప్పుబట్టారు. క్వశ్చన్ పేపర్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్దమని వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేసింది.
జగన్ చెప్పే జాబ్ క్యాలెండర్లో ఎన్ని పోస్టులు ఉంటాయో ఎవరికీ తెలియదు. కానీ సస్పెండ్ చేసిన నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు కూడా వందలు కాదు.. కనీసం పదులు కూడా కాదు.. కేవలం 17. ఈ పోస్టుల భర్తీకి కూడా నిబంధనలకు విరుద్ధమైన రూల్స్ పెట్టి.. కోర్టుల్లో కేసులు పడి.. అవి కూడా భర్తీ కాకపోయినా పర్వాలేదన్నట్లుగా వ్యవహరిస్తోంది.. ఏపీపీఎస్సీ. ఈ సంస్థ చైర్మన్ సవాంగ్ కాబట్టి ఆయనే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే అందరూ.. సవాంగ్ సీనియార్టీ, అవగాహనపై సోషల్ మీడియాలో అనుమానాలు లేవనెత్తుతున్నారు.