వరద భయం నుండి బయటపడ్డాం అనుకుంటున్న బెజవాడ వాసులకు వాతావరణ శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. మూడు రోజుల వరదల నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న బెజవాడలో అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.
విజయవాడతో పాటు ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు సైతం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలతో పాటు అధికారులంతా అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది.
విజయవాడలో కనీవినీ ఎరుగుని వరదల్లో ప్రభుత్వం చేపట్టిన సహయక చర్యల పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. సీఎం కంటిమీద కునుకు లేకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించటం, అధికారులు కూడా సీఎం సూచనలను ఎప్పటికప్పుడు అమలు చేయటంలో బిజీగా ఉండటంతో… ప్రాణనష్టం నుండి బయటపడగలిగారు.
బుడమేరు వరద ఉధృతి తగ్గినా విజయవాడలో చాలా ప్రాంతాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలు కురిస్తే… వరద పెరిగే ప్రమాదం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.