ప్రత్యేక హోదాపై మనని మోసగించిన బీజేపీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ఏమీ మాట అనకుండా వెనకేసుకు వస్తున్నారు. హోదా, విభజన సమస్యలు కాకుండా వ్యక్తిగత దూషణలు, పొరుగు రాష్ట్రపు జోక్యాలు ఎన్నికల అజెండాగా మారడానికి ఆయన అనుసరిస్తున్న వైఖరే కారణం!
ప్రజా ప్రయోజనాల కన్నా అధికార సాధనే లక్ష్యంగా మారితే రాజకీయ పార్టీలు ఏ స్థాయికి దిగజారుతాయనడానికి రాష్ట్రంలో జరుగుతున్న ప్రచార పర్వమే నిదర్శనం. ఈ క్షుద్ర క్రీడలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్న తీరు వాటి బాధ్యతా రాహిత్యానికి అద్దం పడుతోంది.
తెలుగుదేశం – టీఆర్ఎస్ల మధ్య, తెలుగుదేశం – వైసీపీల మధ్య రాజకీయ వైరం ఉంది. కనుక విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ, ఇది శృతి మించి తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు మధ్య చిచ్చు పెట్టి, అగాధాన్ని సృష్టించే దిశగా నడుస్తోంది. ఇదే ఆందోళనకరం.
ఐదు సంవత్సరాల పాలన తరువాత చంద్రబాబు నాయుడు వంటి నాయకుడికి చెప్పుకోవడానికి అంశాలకేమీ కొరవ వుండకూడదు. కానీ, పదే పదే తెలంగాణను, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రస్తావించడమే విజయ వ్యూహంగా ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి నేతృత్వం లోని వైసీపీ గెలుపొందడం అంటే రాష్ట్ర పెత్తనం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల్లోకి వెళ్లిపోతుందని, టీఆర్ఎస్ పాలనే రాష్ట్రం లోనూ కొనసాగుతుందని ఆయన చెబుతున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్నీ ఆయన ప్రస్తావిస్తున్నారు. ‘దీనిని సహిస్తామా తమ్ముళ్లూ..’ అంటూ ఆవేశంగా ఆయన వేస్తున్న ప్రశ్నల్లోని సారాంశం రహస్యమేమి కాదు.
తనంత అనుభవజ్ఞుడు మరొకడు లేరని చెప్పుకునే చంద్రబాబుకు ఈ విద్వేష విష ఫలితం తెలియక కాదు. తెలిసీ విషం చిమ్ముతున్నారంటే అధికార యావ తప్ప మరొకటి కాదు! ఇది ఏ మాత్రం రాజనీతిజ్ఞత కాదు! తెలుగు ప్రజల మధ్య పూడ్చలేని అగాథమేర్పడితే, భావి తరాలు ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోతే ఆ పాపం ఎవరిది? పొరుగు రాష్ట్ర నేతల మద్దతు తీసుకోవడమే తప్పైతే ఎక్కడో ఉన్న కాశ్మీర్, బెంగాల్, ఢిల్లీ నాయకులను చంద్రబాబు రాష్ట్రానికి ఎందుకు తీసుకు వస్తున్నట్లు?
ఈ తరహా వ్యూహంతోనే తెలంగాణలో కేసీఆర్ వరుసగా రెండవసారి అధికారాన్ని చేజిక్కుంచుకోవడంతో ఆంధ్రప్రదేశ్లోనూ అదే ఫార్మూలాను ఆయన అనుసరిస్తున్నారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఈ విద్వేష క్రీడలో తక్కువేం కాదు. చంద్రబాబు రేపుతున్న విద్వేష జ్వాలలకు మరింత ఆజ్యం పోసే విధంగానే ఆయన వ్యవహార సరళి కనపడుతోంది. కేసీఆర్ ప్రమేయంపై వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చిన దాఖలాలే లేవు. పైగా కేసీఆర్ మద్దతు స్వీకరిస్తే తప్పేమిటన్నట్టుగా ఆయన ప్రశ్నిస్తుండటం పుండు మీద కారం చల్లడమే!
ఈ తరహా ప్రతిచర్య వెనుక కూడా రాజకీయ కూడికలు, తీసివేతలే ఉన్నాయని, అన్ని లాభనష్టాలు బేరీజు వేసుకున్న తరువాతే ఈ అడ్డగోలు సమర్ధనకు జగన్ సిద్దపడుతున్నారంటూ వస్తున్న విశ్లేషణలను తోసివేయలేం!
దీనర్ధం ముఖ్యమంత్రి కుర్చీ కోసం ప్రజా ప్రయోజనాలపై ఏ స్థాయి గొడ్డలి వేటుకైనా సిద్ధమేనని! పైగా ప్రత్యేక హోదా చుట్టే ఎన్నికల అజెండా తిప్పుతామని జగన్మోహన్రెడ్డి గతంలో ప్రకటించారు.
ప్రత్యేక హోదాపై మనని మోసగించిన బీజేపీని జగన్ పల్లెత్తు మాట అనకుండా వెనకేసుకు వస్తున్నారు. ప్రస్తుతం హోదా, విభజన సమస్యలు కాకుండా వ్యక్తిగత దూషణలు, పొరుగు రాష్ట్రపు జోక్యాలు ఎన్నికల అజెండాగా మారడానికి ఆయన అనుసరించిన వైఖరే కారణం!
కేసీఆర్ పాత్ర కూడా తక్కువేమీ కాదు! తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా చూపడం ద్వారా స్థానికంగా ప్రజలను రెచ్చగొట్టగలిగారు. అధికారం చేపట్టిన తరువాత బాబుకు ‘రిటర్న్ గిఫ్ట్’ ఇస్తామని ప్రకటించడం, టీఆర్ఎస్ నేతలను రాష్ట్రానికి పంపడం వంటివి తెలుగు రాష్ట్రాల మధ్య సద్భావనకు ఏమాత్రం దోహదం చేయవు.
తెలంగాణలో కూడా ఈ తరహా విద్వేష వ్యూహం ఎక్కువ కాలం పని చేయదని చెప్పడానికి తాజా ఎంఎల్సి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎదుర్కున్న ఘోర పరాజయమే నిదర్శనం!
తెలుగు రాష్ట్రాల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా భావోద్వేగాలను రెచ్చగొట్టేలా నిప్పుతో చెలగాటమాడటాన్ని రాజకీయ పార్టీల నేతలు మానుకోవాలి. రెండు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేసే కార్యాచరణతో ముందుకు రావాలి. ఐక్యంగా ఉన్న తెలుగు ప్రజలను చీల్చి రెండు ముక్కలు చేసినది ఈ విద్వేష రాజకీయాలే.