అయితే ఓ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. లేకపోతే వివాదాస్పద నిర్ణయాలు.. దేశాన్ని ఓ పారిశ్రామికవేత్తకు కట్టబెడుతున్నారనే ఆరోపణలు ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో అలజడి వాతావరణం కనిపిస్తోంది. ప్రతీ దానికి ఆందోళనలు మిన్నంటుతున్నాయి. నిన్నటి వరకూ ఏం చేసినా పెద్దగా పట్టించుకోని జనం ఇప్పుడు ప్రతీ విషయానికి రోడ్డెక్కి తీవ్ర నిరసనలు చేపట్టారు. నుపుర్ శర్మ, జిందాల్‌లు పెట్టిన చిచ్చుతో దేశం కొద్ది రోజులు అట్టుడికిపోయింది. అది ఇంకా రగులుతూండాగనే ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ అగ్గి పెట్టేసింది.
అగ్నిపథ్ పేరుతో అగ్గి !
నాలుగేళ్ల సర్వీస్ ఉండే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. దానికి అగ్నిపథ్ అని పేరు పెట్టింది. నాలుగేళ్ల ఉద్యోగమా అని నిరుద్యోగులు తిరుగుబాటు ప్రారంభించారు. రైళ్లకు నిప్పు పెడుతున్నారు. ఉత్తరాదిలో .ఎక్కడికక్కడ రోడ్లు, రైళ్లను బ్లాక్ చేస్తున్నారు. అగ్నిపథ్ సర్వీసులో పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య యువతను తీసుకుంటారు. ఎంపికైన వారికి ఆరు నెలలు శిక్షణ ఇచ్చి.. నాలుగేళ్లు సర్వీసులో కొనసాగిస్తారు. ఆ తర్వాత ఇరవై ఐదు శాతం మందిని మాత్రమే పర్మినెంట్ చేసి మిగిలిన వారిని ఇంటికి పంపిస్తారు. వారికి ప్యాకేజీ ఇస్తామని.. మరొకటని చెబుతున్నారు. కానీ కీలక దశలో వారిని సర్వీస్‌లోకి తీసుకుని తర్వాత వదిలేస్తే వారి పరిస్థితేమిటనేది ఇప్పుడు వస్తున్న ప్రధాన ప్రశ్న.
యువతను.. ఆర్మీని నిర్వీర్యం చేస్తారా ?
ఆర్మీ రిక్రూట్మెంట్ పద్ధతిలో మార్పులపై యువత తీవ్ర ఆగ్రహం చెందుతోంది. అగ్నిపథ్ కారణంగా ఆర్మీ ఎంట్రీకి గరిష్ట వయోపరిమితి 21 ఏళ్లకు పరిమితం చేస్తారని యువత భయపెడుతోంది. దీని వల్ల తామపై అనర్హత వేటు పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో 25 ఏళ్ల వయకు ఎంపికయ్యే అవకాశం ఉంది. మరో పక్క ఇప్పటిదాకా ఆర్మీలో 17 నుంచి 20 సంవత్సరాల వరకు పనిచేస్తే ఫుల్ పెన్షన్ వచ్చేది. ఇప్పుడు అసలు పెన్షనే లేకుండా చేయబోతున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. అసలు ఆర్మీనే నిర్వీర్యం చేయబోతున్నారని కాంగ్రెస్ సహా పలు పార్టీ ఆరోపిస్తున్నాయి. అగ్నిపథ్ స్కీమ్ అమలైతే.. నాలుగేళ్లలో రిటైరవుతారు. వారికి ఎలాంటి పెన్షన్ సౌకర్యమూ ఉండదని ఉద్యోగార్హులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయాలపై నమ్మకం తగ్గిపోతోందా ?
అయితే ప్రభుత్వం ఏం చేసినా ఈ మధ్య ప్రజలకు నమ్మకం కలగడం లేదు. తప్పే చేస్తున్నారన్న ఉద్దేశంతో ఆందోళనకు దిగుతున్నారు. ఇది ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి కారణం అనుకోవచ్చు. ప్రభుత్వంపై విశ్వాసం ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. చివరికి ప్రజలకు భారం అయి న వాటిని తీసుకున్నా… దేశం కోసం ధర్మం కోసం అనే ఫీలింగ్‌తో మిన్నకుండిపోయారు. కానీ ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. ప్రజాందోళనలకు పోటీగా ప్రభుత్వం కూడా బుల్డోజర్లతో విరుచుకుపడుతూండటంతో అంతటా వినాశనమే కనిపిస్తోంది. ఈ దేశాన్ని ఎటు వైపు తీసుకెళ్తాన్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది.