తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పెట్టి ఏటా వంద కోట్లు నష్టపోతున్నట్లుగా రికార్డులు చూపిస్తున్న ఆహా యాజమాన్యం మీడియాలో అత్యంత ఖర్చుతో కూడుకున్న మరో వెంచర్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆహా పేరుతో ఏకంగా ఓ దినపత్రికనే తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆహా వీడియో అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. ” పొద్దున్నే ఒక చేతిలో కాఫీ, మరో చేతిలో పేపర్’ఆహా’ ఆ ఊహే ఎంత బాగుందో కదా!! అందుకే రాబోతుంది ‘ఆహా’ దినపత్రిక ” అంటూ హింట్ ఇచ్చారు.
ఆహా ఓటీటీ ప్రమోటర్లు మైహోం రామేశ్వరరావు , అల్లు అరవింద్. అయితే వీరు ఇతర మీడియా చానళ్లలోనూ కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. వాటాలు కొన్నారు. 10 టీవీలో మైహోం, మెఘా కృష్ణారెడ్డి, అల్లు అరవింద్‌కు వాటాలు ఉన్నాయి. టీవీ9 లో మై హోం రామేశ్వరరావు, మేఘా కృష్ణారెడ్డి వాటాదారులుగా ఉన్నారు. మీడియాలో ఉన్న పవర్ ఏంటో తెలిసిదేమో కానీ.. ఇప్పుడు పత్రిక కూడా చేతుల్లో ఉంటే ఇంకా బాగుంటుందని అనుకున్నట్లుగా ఉన్నారని అందుకే పత్రికను ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రింట్ మీడియా అవసాన దశలో ఉంది. కొన్ని పత్రికలకు అలవాటుపడిపోయిన వారు తప్ప ఎవరూ న్యూస్ పేపర్ కొనడం లేదు. సర్క్యూలేషన్ పూర్తిగా తగ్గిపోయి ప్రధాన పత్రికలు తంటాలు పడుతున్నాయి. నష్టాల్లోకి వెళ్లిపోతున్నాయి. న్యూస్ ప్రింట్ ధర విపరీతంగా పెరిగింది. ప్రకటనల ఆదాయం పడిపోయింది. పెద్ద పెద్ద పత్రికలు కూడా తమ ఎడిషన్లను తగ్గించుకుంటున్నాయి. ఇప్పుడు ఆహా యాజమాన్యం మాత్రం కొత్తగా పత్రికా రంగంలోకి రావాలనుకోవడం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.