తెలుగులో తొట్ట తొలి ఓటీటీ సంస్థ ఆహా మెల్లమెల్లగా పుంజుకొంటోంది. ముఖ్యంగా ‘అన్ స్టాపబుల్’తో ఆహాకి మైలేజీ బాగా పెరిగింది. దాన్ని కాపాడుకోవడానికి మరింత తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అనిల్ రావిపూడితో ఓ కామెడీ షో ప్లాన్ చేసిన ఆహా.. కొత్త సినిమాలు, వినోద కార్యక్రమాలతో స్పీడు పెంచింది. ఇప్పుడు సీరియల్స్ నికూడా రంగంలోకి దింపుతోంది. అది కూడా ఫ్రీగా చూసే వెసులు బాటుతో. ‘మిస్టర్ పెళ్లాం’ అనే ధారావాహికను నవంబరు 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్కి ఉంచారు. ఇదో కామెడీ నేపథ్యంలో డైలీ సీరియల్. ప్రతీరోజూ ఈ సీరియల్ని ఫ్రీగా చూసే వెసులుబాటు కల్పించారు. ఓటీటీలో యువత ప్రాబల్యమే ఎక్కువ. వాళ్లు సీరియల్స్ కి పెద్దగా కనెక్ట్ అవ్వరు. సీరియల్స్ లక్ష్యం కుటుంబ ప్రేక్షకులే. అలానే.. ఫ్యామిలీ ఆడియన్స్కి ఆహాకి కనెక్ట్ చేయడానికి చేస్తున్న పైలెట్ ప్రాజెక్ట్ ఇది. దీనికి గనుక వ్యూస్ బాగుంటే.. ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని చేపట్టాలని ఆహా భావిస్తోంది.
ఓటీటీలో సీరియల్స్ కి చోటివ్వడం కొత్త సంప్రదాయమైతే… దాన్ని ఉచితంగా అందించడం మరో కొత్త రకమైన ఎత్తుగడ. మరి ఈ వ్యూహం ఆహాకి ఎంత వరకూ ప్లస్ అవుతుందో చూడాలి.