హైదరాబాద్ మరో వైపు అద్భుతమైన నగరం నిర్మించాలనుకుటున్న తెలంగాణ ప్రభుత్వం ఒక్కో అవకాశాన్ని అంది పుచ్చుకుంటోంది. ఇందులో భాగంగా ముచ్చర్ల వద్ద అభివృద్ధి చేయాలని సంకల్పించిన ఫ్యూచర్ సిటీలోనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీని నిర్మించాలని నిర్ణయించారు. ఈమేరకు ప్రపంచ వాణిజ్య కేంద్రం అసోసియేషన్ డబ్ల్యూటీసీఏతో ఒప్పందం కూడా చేసేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఐటీ రంగాన్ని ఏఐ రూల్ చేస్తుందని చెప్పాల్సిన పని లేదు.
శంషాబాద్ వైపు రెడీ అవబోతున్న ఈ ఫ్యూచర్ సిటీకి అన్ని మంచి శకునాలే ఎదురొస్తున్నాయి. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో మెడికల్ సిటీని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు ఉండటం.. మిగతా సేకరణ కూడా పూర్తి చేయాలని నిర్ణయించడంతో కొన్ని వేల ఎకరాలు అందుబాటులోకి వస్తాయి. అక్కడ పూర్తి స్థాయిలో ప్రణాళికా బద్దమైన అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తారు. అందుకే.. ఫ్యూచర్ సిటీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.
సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్యూచర్ సిటీ ప్రస్తావన తెచ్చారు కానీ.. ఇలాంటివి చాలా చెబుతారని.. కానీ ఎంత వరకూ ఆచరణలోకి వస్తాయోనని.. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వర్గాలు అనుమానంతో ఉంటాయి. అలాంటి అనుమానాల్ని పటాపంచలు చేసి… వీలైనంత వేగంగా ఫ్యూచర్ సిటీలో నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చేసేందుకు ప్రభుత్వం కల్పిస్తోంది.