పశ్చిమ గోదావరి జిల్లాలో యుద్ద విమానాల తయారీ సంస్థ ఏర్పాటుకి రంగం సిద్దం అవుతోంది. ఈ వార్త నమ్మశక్యంగా లేదు..కానీ నిజమే. ఏలూరు సమీపంలో భోగాపురం, వట్లూరు గ్రామాలలో సుమారు 350 ఎకరాల విస్తీర్ణంలో రూ.2135 కోట్లు పెట్టుబడితో ఈ సంస్థ ఏర్పాటు చేయబడుతోంది. రక్షణ రంగం ఉత్పత్తులను తయారుచేయడంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన లాక్ హీడ్ మార్టిన్ అనే సంస్థతో కలిసి వేమ్ ఎక్వీప్మేంట్ అనే సంస్థ తేలికపాటి యుద్ద విమానాల నిర్మాణ సంస్థని ఏర్పాటుచేయబోతున్నాయి. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలిపారు. మొదటిదశలో ఆ రెండు సంస్థలు కలిసి రూ.635కోట్లు పెట్టుబడి పెడతాయని చెప్పారు. ఆ సంస్థ ద్వారా మొదటి దశలో 250మందికి, పూర్తి స్థాయిలో ఉత్పత్తికి సిద్దమైనప్పటికి 2,510 మందికి అందులో ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు.
భారత్ లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులని అనుమతించడంతో ఇది సాధ్యం అయ్యింది. రెండు ప్రైవేట్ సంస్థలు కలిసి భారత్ లో రక్షణరంగంలో యుద్ధవిమానాలు తయారుచేయడం ఇదే ప్రధమం. అది ఆంధ్రాలో ఏర్పాటు చేయడం గర్వకారణమే. కానీ ఉభయగోదావరి జిల్లాలో భూములు దేశంలోకెల్లా అత్యంత సారవంతమైనవి. నీటి వసతి పుష్కలంగా ఉండటంతో అక్కడ ఏడాదికి మూడు పంటలు పడుతాయి. అటువంటి భూములని మళ్ళీ ఎక్కడా పునః సృష్టించుకోలేము. కనుక వాటిపై ఈ యుద్ద విమానాల తయారీ సంస్థని ఏర్పాటు చేయడం హర్షించలేము.
నీటి వసతిలేని రాయలసీమలో అనేక ప్రాంతాలలో ప్రభుత్వ భూములు సిద్దంగా ఉన్నాయి. లేదా ఉత్తరాంధ్రలో వెనుకబడిన విజయనగర, శ్రీకాకుళం జిల్లాలలో ఈ పరిశ్రమని ఏర్పాటు చేయవచ్చు. అటువంటి ప్రాంతాలలో ఎన్ని సంస్థలని ఏర్పాటు చేసినా అందరూ హర్షిస్తారు. అక్కడి ప్రజలకి చాల మేలు చేకూరుతుంది. పచ్చటిపంట పొలాలు కాపాడుకోవచ్చు.
అదీగాక అమరావతి చుట్టూ మాత్రమే అభివృద్ధిని కేంద్రీకృతం చేస్తుండటం వలన ఒకప్పుడు హైదరాబాద్ లో చేసిన తప్పునే మళ్ళీ చేస్తున్నట్లు అవుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉన్న జిల్లాలకి అభివృద్ధిని సమానంగా వికేంద్రీకరించకపోతే మళ్ళీ వేర్పాటువాదం కూడా తలెత్తే ప్రమాదంఉంది. కనుక ప్రభుత్వం ఇటువంటి విషయాలలో విమర్శలకి తావీయకుండా అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తే అందరికే మేలు జరుగుతుంది.