వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కొన్ని కీలక స్టేట్ మెంట్ లు రికార్డు చేసినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. వివేకా హత్య గురించి సీఎం జగన్ ను తెల్లవారు జామున నాలుగు గంటలకే తెలుసని..ఆ విషయాన్ని తనతో సమావేశంలో పాల్గొన్న నలుగురికి చెప్పారని కొత్త పలుకు ఆర్టికల్ లో చెప్పారు. ఆ నలుగురిలో ఒకరు జగన్ పీఏ కృష్ణమోహన్ రెడ్డి కాగా మిగతా ముగ్గురు అజేయకల్లాం, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దువ్వూరి కృష్ణ. వీరి వద్ద సీబీఐ స్టేట్ మెంట్ తీసుకుంటుందా లేదా అన్నదానిపై ఇప్పటిదాకా చర్చలు జరుగుతున్నాయి కానీ..వారిలో ఒకరైన అజేయకల్లాం స్టేట్మెంట్ రికార్డు చేసినట్లుగా వెలుగులోకి వచ్చింది.
తెల్లవారు జామున జరిగిన సమావేశంలో సీఎం జగన్ వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారని అజేయకల్లాం సీబీఐకి స్టేట్ మెంట్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. రేపోమాపో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దువ్వూరి కృష్ణనూ ప్రశ్నించే అవకాశం ఉంది. సమయం ఖచ్చితంగా చెప్పలేను కానీ జగన్.. మాత్రం వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారని అజేయకల్లాం చెప్పడం ఇప్పుడు కేసులో కీలకమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా హత్య చేసి గుండెపోటుగా నమ్మించేందుకు భారీ కుట్ర జరిగిందని ఇందులోనే నిందితులందరూ భాగస్వాములు అయ్యారని సీబీఐ అనుమానిస్తుంది. ఇప్పుడు ఈ కేసులో జగన్ పేరు వినిపించడం సంచలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి వివేకా హత్య సమయానికి అటూ ఇటూగా జగన్ పీఏ కృష్ణమోహన్ రెడ్డి, భారతి రెడ్డి పీఏ నవీన్ ఫోన్లకు కాల్స్ వచ్చినట్లుగా గుర్తించారు. వారిని ప్రశ్నించారు కూడా. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఫోన్లు చేశారని .. చనిపోయారని చెప్పడానికి చేసి ఉంటారని ఇంత దానికి ఎందుకు రచ్చ చేస్తున్నారని ప్రశ్నించారు. మొత్తంగా వివేకా హత్య గురించి సీఎం జగన్ ను ముందుగానే తెలుసన్న అభిప్రాయం అంతటా బలపడుతోంది.
కల్లం అజయ్ రెడ్డి అలియాస్ అజేయకల్లాం టీడీపీ హయాంలో చీఫ్ సెక్రటరీగా పని చేశారు. కేంద్రం దగ్గర నుంచి పొడిగింపు తెచ్చి తనకు ఇంకా చాన్స్ ఇవ్వలేదని అప్పటి సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ క్యాంప్ లో చేరారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వంపై ఎన్ని రకాల ఆరోపణలు చేయాలో అన్నీ చేశారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటీ నిరూపించలేకపోయారు. ఇప్పుడు జగన్ దగ్గర ఉన్న సలహాదారుల్లో ఆయన ఒకరు.