పూరి అంటేనే మాటల మరాఠీ. ఒక్కో మాటా.. డైనమైట్ లో పేలుతుంది. సరిగ్గా.. సూటిగా గుండెల్ని తాకుతుంది. ఈ విషయంలో పూరిని మించిపోయాడు.. ఆకాష్ పూరి. తను నటించిన `రొమాంటిక్` సినిమా త్వరలో విడుదల అవుతుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్ లో చాలామంది చాలా చాలా మాట్లాడినా, ఆకాష్ స్పీచే హైలెట్. ఆకాష్ మాట్లాడుతుంటే పూరికి అప్ గ్రేడ్ వర్షనే మాట్లాడుతున్నట్టు అనిపించింది. బహుశా.. ఆకాష్ స్పీచ్ విని – పూరినే ఆశ్చర్యపోయి ఉంటాడు. పూరి డైలాగుల్లో ఎక్కువగా పిట్ట కథలు ఉంటాయి. ఆకాష్ కూడా అలాంటి పిట్ట కథతోనే.. తన తండ్రి గురించి చెప్పడం మొదలెట్టాడు.
” మా నాన్న ఇండస్ట్రీకి వచ్చిన తరువాత ఒక బస్సు కొన్నాడు. అందులో మా అమ్మను .. నన్ను .. మా చెల్లిని ఎక్కించుకుని లాంగ్ డ్రైవ్ కి బయల్దేరాడు. ఒక రాంగ్ పర్సన్ ను నమ్మడం వలన ఆ బస్సు మధ్యలో ఆగిపోయింది. మేమంతా ఆ బస్సులోనే కూర్చుని ఉన్నాము. కానీ మా నాన్న ఒక్కడే బస్సు దిగి దానిని తోయడం మొదలు పెట్టాడు. కొన్ని సంవత్సరాలుగా ఆ బస్సును అలా తోస్తూనే వచ్చాడు“ అని చెప్పి.. తన తండ్రిపై తనకున్న ప్రేమని బయటపెడుతూ “మా నాన్నని ఎవరైనా ఏమైనా అంటే వాడిని ఇంటికి వెళ్లి వాడి తల పగలగొడదామని అనిపించేది నాకు. ‘వీడి పనైపోయింది .. ఇంకేం తీస్తాడు .. సేమ్ అవే సినిమాలు’ అని చెప్పుకునేవారు. కానీ ఆయన ‘ఇస్మార్ట్ శంకర్’ తో ఇచ్చిన హిట్ అలాంటిది ఇలాంటిది..“ అంటూ.. ఉద్వేగంగా మాట్లాడాడు.
ప్రతీ సినిమా మొదటి సినిమాలానే భావించి చేయమని నాన్న చెప్పాడు. కానీ ప్రతీ సినిమానా చివరి సినిమాగా భావించి పనిచేస్తా.. అప్పుడే ప్రాణం పెట్టి పనిచేయగలుగుతా.. అన్నాడు.
‘సక్సెస్, ఫెయిల్యూర్ ముఖ్యం కాదు, నీకిష్టమైన పని నువ్వు చేయగలగడమే సక్సెస్` అని నాన్న అన్నాడు.కానీ… నా దృష్టిలో అది నిజం కాదు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేని వాడు హిట్ కొడితే సక్సెస్ అవుతుంది. ఫ్లాప్ కొట్టినా ఎవడూ పట్టించుకోడు. కానీ.. నేను మా నాన్న అండతో వచ్చా – నేను సక్సెస్ కొట్టకపోతే… అర్థం లేదు..” అని కాస్త ఎమోషనల్ గా మాట్టాడాడు. ”మా నాన్న డైలాగులకు థియేటర్లో ఎగిరెగిరి పడుతుంటే నేను కాలర్ ఎగరేశా, ఇప్పుడు నన్ను చూసి, మా నాన్న కాలర్ ఎగరేయాలి.. అదే నా టార్గెట్” అంటూ.. స్టేజీ దద్దరిల్లేలా మాట్లాడాడు ఆకాష్. మొత్తానికి పూరిలో ఉండే ఫైర్ ఆకాష్ లోనూ కనిపిస్తోంది. బహుశా.. పూరి ఇంకో డైలాగ్ రైటర్ని వెదుక్కోవాల్సిన అవసరం లేదేమో..?