హ్యాట్రిక్ పరాజయాలతో అఖిల్ కెరీర్ డైలామాలో పడిపోయింది. కొత్త దర్శకుల్ని ఎంచుకోవాలా? అనుభవజ్ఞుల్ని నమ్ముకోవాలా? హిట్ సినిమాలున్నవాళ్లని పట్టుకోవాలా… ఏదీ తేలక సతమతమవుతున్న తరుణంలో బొమ్మరిల్లు భాస్కర్ కనిపించాడు. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ సెట్ చేయడంతో – బొమ్మరిల్లు భాస్కర్‌పై నమ్మకం ఉన్నా, లేకున్నా గీతా ఆర్ట్స్‌ని నమ్మి అఖిల్ రంగంలోకి దిగిపోయాడు. అయితే ఈ ప్రాజెక్టు ఓకే అయినా ఇప్పటి వరకూ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఎట్టకేలకు ఇప్పుడు షూటింగ్ మొదలెట్టారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని కూకట్ పల్లి పరిసర ప్రాంతాలలో చిత్రీకరణకు శ్రీకారం చుట్టారు. అఖిల్‌పైనే కొన్ని సీన్లను తెరకెక్కిస్తున్నారు. కథానాయికని ఖరారు చేయాల్సివుంది. కొన్ని టైటిళ్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే ఏదీ ఫైనలైజ్ కాలేదు. మరో పది రోజుల పాటు.. హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరుపుతారు. రెండో షెడ్యూల్లో హీరోయిన్ అడుగుపెడుతుంది. అక్కడి నుంచి సినిమాని ముగించేంత వరకూ నాన్ స్టాప్‌గా సినిమా షూటింగ్ జరపాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.