టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఢిల్లీలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ సమావేశం అయ్యారు. జాతీయ రాజకీయాలపై కీలక చర్చల కోసం ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ ను కలుసుకునేందుకు అఖిలేష్ ప్రత్యేకంగా ఢిల్లీ వచ్చారు. కేసీఆర్ నివాసానికి వెళ్లి చర్చలు జరుపుతున్నారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది. యూపీలో ఎస్పీ గెలుస్తుందనికేసీఆర్ పదే పదే చెప్పారు. అలా గెలిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పడిపోతుందన్నారు.
అయితే తర్వాత ఫలితాలు వేరేగా వచ్చాయి. ఆ ఎన్నికల్లో కేసీఆర్ ఎస్పీ కూటమికి నైతిక మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలోకేసీఆర్తో భేటీకి అఖిలేష్ రావడం రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. బీజేపీ చేస్తున్న మత రాజకీయాలు ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరం గురించి చర్చించారు. మరో వైపు దేశవ్యాప్తంగా పదిరోజుల పాటు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా పలువురు రాజకీయ, ఆర్థిక, జాతీయ మీడియా ప్రముఖులతో కేసీఆర్ సమావేశమవనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి చండీగఢ్‌కు వెళ్తారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. ఆ తర్వాత కర్ణాటక పర్యటనకూ వెళ్తారు. ఈ పర్యటనల్లో తన జాతీయ రాజకీయాల వ్యూహంపై కేసీఆర్ ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.