మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేయడం చట్ట విరుద్దమన్నారు కన్వేషన్ యజమాని, సినీ హీరో అక్కినేని నాగార్జున. ఈమేరకు ఎక్స్ వేదికగా నాగార్జున ఓ పోస్ట్ చేశారు.
స్టే ఆర్డర్ లు, కోర్టు కేసులకు విరుద్దంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు. చట్టాన్ని ఉల్లఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు.
ఎన్ కన్వెన్షన్ నిర్మించిన ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ఆక్రమణకు గురి కాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం అది. గతంలో కూల్చివేతకోసం ఇచ్చిన నోటీసుపై హైకోర్టు స్టే ఇచ్చిందని నాగార్జున తెలిపారు.
Also Read : ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు ఆ మంత్రే కారణమా?
ఈ కూల్చివేత తప్పుడు సమాచారంతో జరిగిందని పేర్కొన్నారు.తాజాగా కూల్చివేతకు సంబంధించి ముందస్తు నోటీసు కూడా ఇవ్వలేదన్న నాగార్జున..ఇందుకు సంబంధించి కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదన్నారు.
చట్టాన్ని గౌరవించే వాడిని..కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే ఆ కన్వెన్షన్ నేనే కూల్చేవాడిని అంటూ పేర్కొన్నారు. ఈ కూల్చివేతలతో తాము ఆక్రమణలు చేసి, ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టినట్లుగా ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తుందని, అందుకే ఈ వివరణ ఇస్తున్నట్లు వివరించారు.