తెలంగాణలో విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన రేవంత్ సర్కార్.. ఈ విద్యా కమిషన్ చైర్మన్ గా ఎవరిని నియమించనున్నారు..? అనే దానిపై కొన్ని రోజులుగా జోరుగా చర్చ జరుగుతోంది. పలువురి పేర్లు రేసులో వినిపిస్తున్నా..అనుభవం కల్గిన విద్యావేత్తకు కమిషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించాలని సీఎం భావిస్తున్నారు.
విద్యా కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరిగిన మొదట్లోనే.. ఈ కమిషన్ ఏర్పాటు చేసి కోదండరాంను చైర్మన్ ను నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడంతోపాటు కేబినెట్ లోకి తీసుకుంటారని ఇటీవల ఊహాగానాలు వస్తున్నాయి. దాంతో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ చైర్మన్ గా రేవంత్ సర్కార్ ఎవరిని నియమించనున్నది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ మద్దతుదారుడుగా కొనసాగుతోన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని విద్యా కమిషన్ చైర్మన్ గా నియమించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఓటమి పాలయ్యాక రేవంత్ సర్కార్ పై కొన్ని విషయాల్లో విమర్శలు వచ్చినా ప్రభుత్వ నిర్ణయాలను మురళి సమర్ధిస్తున్నారు. పైగా.. బీఆర్ఎస్ ను ఇంకా సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో చీల్చి చెండాడుతూనే ఉన్నారు.
ఇక, ప్రభుత్వ విద్య బలోపేతం విషయంలో నిర్దిష్టమైన అవగాహనా కల్గిన అకుమూరి మురళిని విద్యా కమిషన్ చైర్మన్ గా నియమిస్తేనే.. ప్రభుత్వ బడులను కార్పోరేట్ కు ధీటుగా తీర్చిదిద్దాలనే సర్కార్ లక్ష్యం నెరవేరుతుందని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆయన నియామకాన్ని రేవంత్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.