రాజకీయ రంగ ప్రవేశం చేయాలని ఆసక్తితో ఉన్న సినీ నటుడు అలీ తన ఓటును హైదరాబాద్ నుంచి గుంటూరుకు మార్పించుకున్నారు. గతంలో ఆయనకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది. అక్కడ రద్దు చేసుకుని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. మరో వైపు.. తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు తూర్పు అసెంబ్లీ స్థానానికి.. ఆయన పేరు పరిశీలనకు వచ్చింది. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన సమీక్షలో… ఈ మేరకు.. చంద్రబాబు అలీ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో.. ప్రధాన పార్టీలన్నీ ముస్లిం అభ్యర్థులకే టిక్కెట్లు కేటాయిస్తూ ఉంటాయి. గత ఎన్నికల్లో… భారతీయ జనతా పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ముస్లింల ఓట్లు ఎలాగూ రావని హిందూ ఓట్లను పోలరైజ్ చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు అక్కడ అనూహ్యంగా.. ఆర్యవైశ్య అభ్యర్థి అయిన మద్దాళి గిరికి అవకాశం కల్పించారు. గట్టి పోటీ ఇచ్చిన మద్దాళి గిరి ఓటమి పాలయ్యారు. అయినా ఆయన తూర్పు నియోజకవర్గంలో విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు.. బీజేపీతో పొత్తు లేకపోవడంతో.. వైసీపీ బీజేపీకి దగ్గరయిన సూచనలు కనిపిస్తూండటంతో.. ముస్లింలలో మార్పు కనిపిస్తోందని… ఈ సారి గట్టి అభ్యర్థికి టిక్కెట్ ఇస్తే విజయం సాధిస్తారని.. చంద్రబాబు ఆలోచిస్తున్నారు.
గుంటూరులో అలీకి బంధుత్వాలు ఎక్కువగా ఉన్నాయి. అలీ తమ్ముడు ఖయ్యూం .. గుంటూరు అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. ఆ బంధుత్వాలు ఎక్కువగా ఉండటం.. వారు కూడా గుంటూరులో పలుకుబడి ఉన్నవారు కావడంతో.. చంద్రబాబు… అలీ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన … ఓటు హక్కును గుంటూరుకు మార్చుకున్నారు.