దేశంలో ఎడ్యూటెక్ కంపెనీగా సంచలనం సృష్టించిన బైజూస్ ఇప్పుడు సంక్షోభంలో ఇరుక్కుపోయింది. ఏ మాత్రం క్వాలిటీ లేని కంటెంట్ … ఎంతో ఆశ పెట్టి భారీ ధరలు పెట్టి కొనుగోలు చేసినా ఎవర్నీ సంతృప్తి పర్చలేకపోయిన తీరుతో ఇప్పుడా కంపెనీని అంతా కామెడీ చేస్తున్నారు. బైజూస్ కంటెంట్ ను కొత్తగా కొంటున్న వారే లేరు. దీంతో ఆ కంపెనీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. యూనికార్న్ కంపెనీగా మారి…. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ మెంట్స్ ఆకర్షించి.. అప్పులు చేసి.. అ డబ్బులన్నీ ఏం చేశారో తెలియని చెప్పలేని స్థితికి వెళ్లిపోయింది.
ఒక ఆర్థిక సంవత్సరం ఫలితాలను ఏడాదిన్నర తర్వాత ప్రకటించడమే కాకుండా .. రెండు వేల కోట్ల అమ్మకాలపై నాలుగున్నర వేల కోట్ల నష్టాల్ని చూపించారు. గత ఆర్థిక సంవత్సరం ఫలితాలను ప్రకటించలేదు. కానీ ఇప్పటికే లోన్లు కట్టలేక.. కోర్టులకు వెళ్తున్నారు. తాజాగా ఆ కంపెనీ బోర్డు నుంచి ఇన్వెస్టర్ల ప్రతినిధులంతా రాజీనామాలు చేశారు. బోర్డులో ఉన్న ఆడిటింగ్ కంపెనీ డెలాయిట్ నుంచి కూడా డైరక్టర్ ఉండేారు. ఆయన కూడా రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు బోర్డులో బైజూ రవీంద్రన్, ఆయన సోదరుడు, భార్య మాత్రమే ఉన్నారు. ఫేస్ బుక్ కు చెందిన చాన్ జుకర్ బర్గ్ ఇనిషియేటివ్ ప్రతినిధి కూడా బైజూస్ కు గుడ్ బై చెప్పేశారు.
ఓ వైపు ప్రతి నెల.. ఉద్యోగులకు లే ఆఫ్ లు ప్రకటిస్తోంది బైజూస్. గత నెలలోనూ వంద మందిని తొలగించారు. వినియోగదారులు తగ్గిపోవడంతో వర్క్ ఫోర్స్ అవసరం లేకుండాపోయింది. మార్కెట్లో విశ్వసనీయత కోల్పోవడంతో ఎవరూ కొత్తగా బైజూస్ ను కన్సిడర్ చేయడం లేదు. మరో వైపు భారీగా తెచ్చిన అప్పులు.. ఇన్వెస్ట్ మెంట్లు దారి మళ్లించారో.. కరిగిపోయాయో తెలియని పరిస్థితి. అందుకే బైజూస్ లో గందరగోళం ఎడ్యూటెక్ కంపెనీలకు ఓ పాఠంలా మారింది.