సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ వ్యవహారశైలిపై ఏపీ ప్రతిపక్ష నేతలకు ఎక్కడా లేనంత ఆగ్రహం ఉంది. వారి చేతికి అధికారం వచ్చిన తర్వాత సునీల్ కుమార్ ఎలాంటి పరిస్థితుల్లో పడతారో చూస్తారని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పీవీ సునీల్ ప్రతిపక్ష నేతలపై వేధింపులకు పాల్పడటమే దీనికి కారణం అని అనుకోవచ్చు.. కానీ ఆయన అధికార పార్టీ రాజకీయం కోసం ఆ పని చేసినా.. అధికారాన్ని సొంతానికి కూడా దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఆయన కుటుంబం నుంచే వస్తున్నాయి.
పీవీ సునీల్ కుమార్ మామ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. సీఐడీ చీఫ్ గాఉన్న సునీల్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన తీరుపై కేంద్ర విజిలెన్స్, సీబీఐ అధికారులతో దర్యాప్తు చేయించాలని ఆ పిటిషన్ సారాంశం. పీవీ సునీల్ కుమార్ భార్య ఆయనపై గృహహింస కేసు పెట్టింది. దీన్ని వాపస్ తీసుకోవాలని ఆయన ఇదంతా చేస్తున్నారంటున్నారు. పీవీ సునీల్ మామకు ఇటీవల ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ సోదరిని పీవీ సునీల్ పెళ్లి చేసుకున్నారు. పీవీరమేష్ సోదరుడు రాజశేఖర్ జోషి ఓఎన్జీసీలో పని చేస్తారు. ఆయనకు భార్యతో విబేధాలున్నాయి. దాంతో కేసులు పెట్టించి రాత్రికి రాత్రి రాజశేకర్ జోషిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పీవీ రమేష్ తల్లిదండ్రుల్నీ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాలన్నింటికీ పీవీ సునీల్ అధికార దుర్వినియోగం చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇదే తరహాలో రఘురామకృష్ణరాజు కూడా పీవీ సునీల్‌పై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీలో పనితీరుతో అత్యంత వివాదాస్పదమవుతున్న అధికారుల్లో పీవీ సునీల్ కుమార్ మొదటి వరుసలో ఉంటారని అనుకోవచ్చు.